● చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్
● ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు
ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ–మంగళ్‌పల్లి నక్షా రోడ్డుకు అడ్డంగా కందకాలు తవ్వి రాకపోకలు నిలిపివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. మండల పరిధిలోని ఉప్పరిగూడ, మంగళ్‌పల్లి గ్రామాలకు 1999లో మెటల్ రోడ్డును వేశారు. నాటి నుంచి ఈ మార్గంలో రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రికి రాత్రే ఉప్పరిగూడకు చెందిన రైతులు ఆ రోడ్డును ధ్వంసం చేసి రెండు చోట్ల కందకాలు తవ్వి పాడు చేశారని, నక్ష బాట వదిలేసి వారి పొలం నుంచి రోడ్డు వేసుకున్నారని శనివారం ఉప్పరిగూడ, మంగళపల్లి రెవెన్యూ ప్రాంతాలకు చెందిన రైతులు ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్‌రెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేస్తామని రైతులకు సర్ధిచెప్పారు. అనంతరం రైతులు సురేందర్‌రెడ్డి , మోహన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. 33 ఫీట్లతో ఉన్న నక్ష బాటను ఉప్పరిగూడకు చెందిన జమ్మిడి బాల్‌రెడ్డి, మడుపు సుమన్, సురేశ్, శివ, వెంకటేశ్ వారి పొలం నుంచి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. రెండు చోట్ల నాలుగు పీట్ల లోతు జేసీబీతో కందకాలు తవ్వి రాకపోకలకు ఇబ్బందులు కల్పించారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో బీటీ రోడ్డు, మెటల్ రోడ్డు వేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రోడ్డును కబ్జా చేసి పట్టా భూమిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రోడ్డును కాపాడి గుంతలు తవ్విన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


