అధికారంలోకి వస్తే 111 జీవో ఎత్తివేస్తాం | - | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే 111 జీవో ఎత్తివేస్తాం

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

అధికారంలోకి వస్తే 111 జీవో ఎత్తివేస్తాం

మొయినాబాద్‌: ‘111 జీవో ఎత్తివేసే అంశంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఈప్రాంత ప్రజలను మోసం చేశాయని, మేము అధికారంలోకి వస్తే వెంటనే ఆజీవోను తొలగిస్తాం’ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం ఆమె చిలుకూరు బాలాజీని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొయినాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆడబిడ్డల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. మీకేం కావాలో ఆడబిడ్డగా, ఓ సోదరిగా తనకు తెలుసని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎలాంటి గ్యారంటీ లేకుండా బ్యాంకుల ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయిస్తామన్నారు. ఆయా లక్ష్యాలను సాధించేందుకే తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా పుట్టుకొచ్చామన్నారు. చుట్టుపక్కల భూములు ఎకరాకు రూ.వంద కోట్లకు పైగా పలుకుతుంటే 111 జీవో పరిధిలోని ప్రజలు మాత్రం తమ భూములను ఎక్కువ ధరకు అమ్ముకోలేని పరిస్థితి ఉందన్నారు. పిల్లల పెళ్లిళ్లకోసం పావు ఎకరం భూమి అమ్మాలన్నా ఈ జీవో అడ్డంకి వల్ల రేటు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంపు మేసీ్త్ర(సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి) తనకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే బాగా తెలుసని చెప్పాడు.. కానీ ఆ వ్యాపారాన్ని ఊడగొట్టిండని విమర్శించారు. చేవెళ్ల, మొయినాబాద్‌లో ఎక్కువగా రైతులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉంటారని.. అందరికీ మేలు చేసేలా ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. అందుకే గుంపుమేసీ్త్రపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తన పార్టీకి స్వామి వారి ఆశీస్సులకోసం వచ్చామని.. చిలుకూరు బాలాజీ దయతో రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న రైతులకు మంచి చేసే బుద్ధిని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇవ్వమని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం సురంగల్‌లో సంతోష్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బస్‌ షెల్టర్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుమ్మరి శివకుమార్‌, అన్వర్‌ఖాన్‌, నూర్‌బాయ్‌, నాగేష్‌, భిక్షపతి, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈవిషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేశాయి

టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

మొయినాబాద్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ

Advertisement
 
Advertisement
Advertisement