అబ్దుల్లాపూర్‌మెట్: పై వంతెనల నిర్మాణం పూర్తికాక పోవడంతో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్నేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు ఎట్టకేలకు మోక్షం కలిగిన విషయం తెలిసిందే. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారి విస్తరణ చేపట్టాలంటూ వస్తున్న ప్రతిపాదనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గత ఏడాదిన్నరగా పనులు శరవేగంగా కొనసాగుతూ తుది దశకు చేరుకున్నాయి. కానీ ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్‌బీనగర్ నుంచి దండుమల్కాపూర్ వరకు 24 కిలోమీటర్ల మేర ఇరువైపులా మూడేసి రహదారుల చొప్పున విస్తరణ చేపట్టేందుకు రూ.600 కోట్లు మంజూరు కాగా కోవిడ్, గుత్తేదారుల సమస్యలతో పెండింగ్ పడుతూ వస్తున్నాయి. హయత్‌నగర్ చివరి నుంచి దండుమల్కాపూర్ వరకూ రోడ్డు పనులు దాదాపు పూర్తి అయినప్పటికీ అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర పనులను గతేడాది నుంచి నిలిపివేశారు. దీంతో చౌటుప్పల్ వైపు నుంచి హైదరాబాద్‌కు... నగరం వైపు నుంచి చౌటుప్పల్ వైపునకు వెళ్లే వాహనాలు వేగంగా వచ్చి అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో నెమ్మదిగా వెళుతున్నాయి. దీనికి ఇరుకుగా ఉన్న రహదారే కారణం.
విజయవాడ జాతీయ రహదారిపై చేపడుతున్న విస్తరణ పనుల్లో ఎనిమిది ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా వాహనాల రద్దీతో పాటు ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఎల్‌బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు చేపడుతున్న రోడ్డు విస్తరణలో వనస్థలిపురం పనామా కూడలి, హయత్‌నగర్‌లో కుంట్లూర్ రోడ్డు, అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో ఘట్‌కేసర్ రోడ్డు, అనాజ్‌పూర్ రోడ్ల వద్ద పై వంతెనల నిర్మాణం కాకపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెద్దఅంబర్‌పేటలో పసుమాముల రోడ్డు, కొహెడ రోడ్డు వద్ద, ఇనాంగూడ, బాటసింగారం కూడళ్ల వద్ద ఫ్లై ఓవర్ల నిర్మాణం పూర్తయి వాహనాలు సాఫీగా వెళుతున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో గండిమైసమ్మ దేవాలయం నుంచి మయూరి కాంట వరకు రెండువైపులా నిలిచిన రోడ్డు విస్తరణ చేపడితే 24 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణలో దాదాపు పూర్తి అయినట్లేనని స్థానికులు పేర్కొంటున్నారు.
వారం పాటు హడావుడి
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరం నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లే వాహనాల సంఖ్య విపరీతంగా ఉంటుందని, వాటికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గత జనవరిలో చర్యలు చేపట్టారు. పండుగకు నాలుగు రోజుల ముందు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులను తెల్లవారుజామునే పోలీసు బందోబస్తుతో తొలగించిన అధికారులు రోడ్డు నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదు. కేవలం సంక్రాంతికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే వారం రోజుల పాటు హడావుడి చేశారని, తర్వాత రోడ్డు విస్తరణ గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నారు.
అక్కడే ప్రమాద ఘంటికలు
అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిలిచిన హైవే విస్తరణ పనులు
పూర్తికాని ఫ్లై ఓవర్ల నిర్మాణం
తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు
పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా రహదారులను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో చేపట్టిన విజయవాడ హైవే విస్తరణ పనులు గతేడాదిగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిలిచిపోయాయి. వాహనదారులు అటు హైదరాబాద్ రావడానికి, ఇటు విజయవాడ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.