తన భార్యను అప్పగించాలని పీఎస్ ఎదుట భర్త ఆందోళన
యాచారం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారని ఓ వ్యక్తి ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గ్రామానికి చెందిన పి.వంశీ, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి గ్రామానికి చెందిన తేజస్విని కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలకు చెందిన వీరు(ఇద్దరు మేజర్లు) కొద్ది రోజుల కింద ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. రక్షణ కోసం నగరంలోని మీర్‌పేట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి రక్షణ కోరారు. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. నూతన దంపతులు మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామంలో వంశీ బంధువుల ఇంటి వద్ద ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తేజస్విని కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఎవరూ లేనిది చూసి నవ వధువుని తీసుకెళ్లారు. దీంతో వంశీ యాచారం పోలీసులను ఆశ్రయించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య తేజస్విని ఆమె కుటుంబ సభ్యులకు కావాలనే తనకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో శుక్రవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసిన యాచారం పోలీసులు తేజస్విని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
ఇబ్రహీంపట్నం రూరల్: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి జీవిత ఖైదుతో పాటు, రూ.12వేలు జరిమానా వేధిస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని మణిపూర్ ప్రాంతానికి చెందిన అవినాష్ సాహ్ని (42) ఆదిబట్లలో ఉంటూ కూలీ పనులు చేసేవాడు. 7నవంబర్ 2023న కూతురు(14)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయాన్ని ఆమె తల్లికి చెప్పడంతో స్థానిక పీఎస్‌లో కేసు నమోదు చేయించారు. పూర్వాపరాలను పరిశీలించిన స్పెషల్ సెషన్స్ కోర్టు ఫర్ ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ పోక్సో కేసుల న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెల్లడించారు. బాధితురాలికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం మంజూరు చేశారు.
మహిళా న్యాయవాదిపై దాడి.. బెదిరింపులు..
బంజారాహిల్స్: మహిళా న్యాయవాదిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్కు సమీపంలో నివాసం ఉండే న్యాయవాది సాయిరమ్య ప్రణీత (30) ఈ నెల 17న రాత్రి తన భర్త, అత్తతో కలిసి జూబ్లీహిల్స్ క్రీమ్‌స్టోన్ సమీపంలో ఉండగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి ఆమె వాహనాన్ని ఫోటోలు తీస్తున్నాడు. ఆమె ప్రశ్నించగా సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు పంపేందుకు ఫోటోలు తీస్తున్నట్లు సమాధానమిచ్చాడు. వారి మధ్య వాగ్వివాదం జరుగుతుండగానే హుమేరా వార్సీ అనే మహితో పాటు మరో ఇద్దరు అక్కడికి వచ్చి సాయిరమ్య ప్రణీతను దుర్బాషలాడుతూ అసభ్య పదజాలంతో బెదిరింపులకు దిగారు. ఆమెతో పాటు భర్త, అత్తను చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు సిగరెట్ పొగను ఉద్దేశపూర్వకంగా వారి వైపు ఊదారు. అంతటితో ఆగకుండా మహిళా న్యాయవాదిని హుమేరా వార్సీ చెంపదెబ్బ కొట్టంది. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువతిని వేధించిన నేపాలీలకు 7 రోజుల జైలు
అబిడ్స్: ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు నేపాలీలకు వారం రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అబిడ్స్ ఇన్‌స్పెక్టర్ పరశురామ్ తెలిపిన మేరకు..బషీర్‌బాగ్ చౌరస్తా సమీపంలో సీసీఎస్ ఎదురుగా ఓ యువతి వెళ్తుండగా నేపాల్‌కు చెందిన సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తమ్, రామ్‌లు అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరుచగా న్యాయస్థానం ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
బాలానగర్: టీజీ పాలిసెట్ పరీక్షలోఉత్తీర్ణులైన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన జేఎన్‌టియుహెచ్‌లో శుక్రవారం ప్రారంభమైంది. జూన్ 1 వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తామని అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ బాలు నాయక్ తెలిపారు. 380 మంది సర్టిఫికెట్స్ పరిశీలనకు హాజరు కావాల్సి ఉండగా 228 మంది మాత్రమే వచ్చారన్నారు.


