సనత్‌నగర్: గుండెపోటుతో కుప్పకూలిన ఓ మహిళకు సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. పంజగుట్ట ద్వారకాపురికాలనీకి చెందిన పొట్ల లావణ్య (45) శుక్రవారం బేగంపేట భారత్ పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దాటుతోంది. దాటుతుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో కిందపడిపోయింది. అక్కడే ఉన్న సిద్దిపేటకు చెందిన గంగాధర్, బేగంపేటకు చెందిన ఆసిఫ్ వెంటనే స్పందించి సాయమందించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, సిబ్బంది భరత్, మన్మథరావు, మునీందర్ సచిన్, సోహైల్‌లు సైతం అక్కడికి చేరుకుని సీపీఆర్ నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ శంకర్‌రాజు కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మానవత్వంతో స్పందించి సహాయం అందించిన పౌరులను గుడ్ సమారిటన్ అవార్డు కోసం సిఫారసు చేయనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.


