న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌సిటీ వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ), యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పనులు, రేడియల్ రోడ్డు నిర్మాణ పనులు ఊపందుకోగా.. మరోవైపు అమెజాన్ డేటాసెంటర్ విస్తరణ, కంట్రోల్ డేటా సెంటర్ పనులు మొదలయ్యాయి. ఎత్తయిన కొండలు, గుట్టలను చదును చేసే పనిలో పదుల సంఖ్యలో ఇటాచీలు, జేసీబీలు నిమగ్నమయ్యాయి. భవనాలు, రోడ్ల నిర్మాణ పనుల్లో పలు రాష్ట్రాలకు చెందిన వందలాదిమంది కార్మికులు రాత్రిపగలు తేడా లేకుండా పని చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తై తుదిమెరుగులు అద్దుకుంటున్న ఎఫ్‌సీడీఏ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జూన్ 2 లేదా 3 తేదీల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం మీర్‌ఖాన్ పేటలోని స్కిల్ వర్సిటీ, ఎఫ్‌సీడీఏ పనులను పరిశీలించారు.
ఊపందుకున్న స్కిల్ వర్సిటీ పనులు
మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ పరిధిలో స్కిల్ వర్సిటీకి ప్రభుత్వం 57.85 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ మొత్తం 4,03,693 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడుతున్నారు. మూడు జీ+2 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్లాబ్ వర్క్ పూర్తై బ్రిక్స్ వర్క్స్ కొనసాగుతున్నాయి. 89,373 చదరపు అడుగుల విస్తీర్ణంలో అకడమిక్ బ్లాక్, 2,080 సీట్ల సామర్థ్యంతో 42 క్లాస్ రూమ్‌లు, 200 సీటింగ్ సామర్థ్యంతో సెకండ్ ఫ్లోర్‌లో రెండు సెమినార్ హాల్స్ నిర్మిస్తున్నారు. బాలబాలికలకు ప్రత్యేకంగా 97 గదుల చొప్పున 300 బెడ్స్ సామర్థ్యంతో రెండు మూడంతస్తుల వసతి గృహ భవనాలను నిర్మిస్తున్నారు. రెండు స్టాఫ్ క్వార్టర్స్, గెస్ట్‌హాస్, బాలబాలికల కోసం ప్రత్యేకంగా కిచెన్, డైనింగ్, హెల్త్‌సెంటర్, షాపింగ్ సెంటర్, వీసీ గెస్ట్‌హౌస్, డార్మెంటరీ నిర్మిస్తున్నారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తుది మెరుగుల్లో ఎఫ్‌సీడీఏ భవనం
ఎఫ్‌సీడీఏ భవనానికి ప్రభుత్వం 7.06 ఎకరాలు కేటాయించింది. 16,393 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టిన జీ+1 అంతస్తుల భవనం ఇప్పటికే పూర్తయింది. స్టెచర్స్‌పై గ్లాస్ ఫిటింగ్ వర్క్స్, రూఫ్ టాప్‌పై సోలార్ ప్యానల్స్ బిగింపు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, మీటింగ్ హాల్స్, ఇంటర్నల్ వుడ్ పార్టిషన్ వర్క్, లైటింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫర్నిచర్, లిఫ్ట్, క్లీనింగ్, గార్డెనింగ్, టైల్స్ వర్క్స్ కొనసాగుతున్నాయి.
అమెజాన్ డేటా సెంటర్ పనుల్లో వేగం
గ్లోబల్ డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల (డేటాసిటీ)కోసం భారీగా భూములు కేటాయించారు. రూ.5,800 కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభించిన అమేజాన్ వెబ్ సర్వీస్ (ఏడబ్ల్యూస్) డేటా సెంటర్‌కు తొలిదశలో 48 ఎకరాలు కేటాయించగా ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి, ఆపరేషన్ కూడా ప్రారంభించింది. తాజాగా మరో 202.26 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టింది. దీనికి సమీపంలోనే 35 ఎకరాల్లో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ పనులు ప్రారంభమయ్యాయి.
శంకుస్థాపనలకు యాక్షన్‌ప్లాన్
పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలకు భద్రతకల్పించేందుకు మీర్‌ఖాన్‌పేటలో 24 ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనం నిర్మిస్తున్నారు. ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా మరికొన్ని భవనాలకు శంకుస్థాపన చేసేందుకు యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేశారు. ఎన్‌ఐయూఎం, సింగరేణి భవనాలు సహా మరో 14 ఫార్మ కంపెనీలకు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) కేంద్రాలకు సైతం శంకుస్థాపనలు చేయనున్నారు.
వేగంగా రేడియల్ రోడ్డు పనులు
పరిశ్రమలకు భూముల కేటాయింపులు.. నిర్మాణాలు
ప్రారంభానికి సిద్ధంగా ఎఫ్‌సీడీఏ భవనం
త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు
మారుతున్న మీర్‌ఖాన్‌పేట్ ముఖచిత్రం


