● రావిర్యాలలోని హౌసింగ్ బోర్డు స్థలాలకు భారీ డిమాండ్
● కొనుగోలుకు వేలంలో పోటీపడ్డ బిల్డర్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాజధాని క్యూర్ పరిధిలో పెద్దపెద్ద వెంచర్లు చేపట్టడానికి అనువుగా ఉన్న భూములకు డిమాండ్ పెరుగుతోంది. అందులోనూ ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్స్‌తో ప్రభుత్వానికి చెందిన హౌసింగ్ బోర్డ్ స్థలాలకు మరింత భారీగా ఉంటోంది. మహేశ్వరం మండలం, ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్‌లో ఎయిర్‌పోర్టుకు సమీపంలోని రావిర్యాలలో భూములు కొనుగోలు చేయడానికి అనేక మంది పోటీపడ్డారు. ఈ ప్రాంతలో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు గురువారం ఈ–ఆక్షన్ ద్వారా వేలం నిర్వహించారు. మొత్తం నాలుగు భూములకు నిర్వహించిన వేలం పాటలో చదరపు గజం గరిష్టంగా రూ.83,500కు అమ్ముడు పోయినట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. వెయ్యి నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలం పాట ద్వారా సుమారు రూ.140 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ భూములను ఈ–ఆక్షన్‌లో వేలం పాట ద్వారా విక్రయిస్తున్నట్లు గత నెలలో హోసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 17 సంస్థలు పోటీ పడ్డాయి. ఇందులో 1,113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి బిల్డర్లు పోటీ పడ్డారు. రూ.26 వేల కనీసధరను నిర్ణయించగా, దీనిని దక్కించుకోడానికి పోటీ పడుతూ చదరపు గజం రూ.83,500కు ఒక డెవలపర్ సంస్థ దక్కించుకుంది. ఇదే ప్రాంతంలోని సుమారు 6 వేల చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి వేలం పాటలో చదరపు గజం రూ.62,500కు అమ్ముడుపోయింది. సుమారు 13,500 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని కొనుగోలు చేయడానికి సైతం బిల్డర్లు పోటీ పడ్డారు.


