కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకేగూటి పక్షులు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకేగూటి పక్షులు

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకేగూటి పక్షులు

శంకర్‌పల్లి: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకే గూటి పక్షులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. శంకర్‌పల్లి మండలం ప్రొద్దటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో రెండురోజుల పాటు నిర్వహించే పండిత్‌ దీన్‌ దయాల్‌ జిల్లా ప్రశిక్షణ తరగతులను గురువారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలని ఓర్వలేకే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ జట్టు కట్టాయని విమర్శించారు. దీన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. ఈ రెండు పార్టీలు విచ్ఛిన్నశక్తులుగా మారుతున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేసి డబుల్‌ సర్కార్‌ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం రానున్న రెండున్నరేళ్లు నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ సుమారు రూ.13లక్షల కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్‌, గోవా, అస్సాం రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్‌ కోడ్‌)ని అమలు చేసినట్లే మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. రైతులకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరాజ్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, జిల్లా ఉపాధ్యక్షుడు ఇంద్రారెడ్డి, నాయకులు తూళ్ల వీరేందర్‌ గౌడ్‌, అంజన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు

Advertisement
 
Advertisement
Advertisement