● ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
షాద్‌నగర్‌రూరల్: పట్టణ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సివిల్ సప్‌లై కార్పొరేషన్, జిల్లా పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేలా రైతుకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మహ్మద్‌అలీఖాన్‌బాబర్, డైరెక్టర్ కరుణాకర్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.


