భగీరథ.. లీకేజీల వ్యథ | - | Sakshi
Sakshi News home page

భగీరథ.. లీకేజీల వ్యథ

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

నీటి సరఫరాలో అంతరాయం

తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

పంచాయతీలపై మరమ్మతుల భారం

యాచారం: మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో తరచూ అంతరాయంతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఎప్పుడు సరఫరా అవుతాయో.. ఎప్పుడు నిలిచిపోతాయో తెలియక గ్రామ పంచాయతీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలాల్లోని 75 గ్రామ పంచాయతీలతో పాటు 125 అనుబంధ గ్రామాలున్నాయి. అదే విధంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఉంది. ఈ ప్రజల దాహార్తి కోసం నిత్యం రెండు కోట్ల(20 ఎంఎల్‌డీ) లీటర్లకు పైగా మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతోంది. కర్కలపహాడ్‌ నుంచి ముచ్చర్ల సంపుహౌజ్‌ల నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్‌ ప్రజలకు నిత్యం నీరొస్తోంది. మిషన్‌ భగీరథ నీటిని గ్రామ పంచాయతీల్లో ఉన్న ట్యాంకుల్లోకి నింపి, ఆ తర్వాత నల్లాల ద్వారా ఇంటింటికి సరఫరా చేస్తారు.

రెండుమూడు రోజులకు ఇబ్బంది

మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో తరచూ అంతరాయంతో గ్రామీణ ప్రజలకు శాపంగా మారింది. పక్షం రోజులకోసారి కోల్లాపూర్‌, గుడిపల్లి గుట్ట, కర్కల్‌పహాడ్‌, ముచ్చర్ల సంపుల వద్ద పైపుల లీకేజీలు, మరమ్మతులతో ఇబ్రహీంపట్నం డివిజన్‌ ప్రజలకు నీటి సరఫరా నిలిచిపోతుంది. మిషన్‌ భగీరథ నీరు ఉందనే భరోసాతో గ్రామ పంచాయతీలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టడం లేదు. దీంతో పక్షం రోజుల్లో రెండు, మూడుసార్లు ఇబ్బంది ఏర్పడుతోంది. ముఖ్యంగా అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నెలకొంటుంది. మిషన్‌ భగీరథ అధికారులు సడన్‌గా నీటి సరఫరా బంద్‌ అయిందని సమాచారం ఇవ్వడంతో గ్రామ పంచాయతీలు కూడా ఏం చేయలేని పరిస్థితి దాపురించింది. యాచారం, మంచాల మండలాల్లో సైతం రెండు రోజులుగా నీటి సరఫరా బంద్‌ కావడంతో ప్రజల తిప్పలు అధికమయ్యాయి.

ఫ్లోరైడ్‌ నీళ్లే దిక్కు

మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామ పంచాయతీలపై మరమ్మతుల భారం పడుతోంది. డివిజన్‌లో 289 సింగల్‌ ఫేజ్‌, 249 త్రీఫేజ్‌ బోరుమోటార్లు ఉన్నాయి. రెండేళ్లుగా సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో సగానికి పైగా మోటార్లు ఎండిపోయాయి. పంచాయతీల్లో ఉన్న మోటార్లు కాలిపోవడంతో తక్షణ మరమ్మతుల కోసం సర్పంచులు అప్పులు చేయాల్సి వస్తుంది. యాచారం, మంచాల మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో బోరుబావుల్లో ఫ్లోరైడ్‌ నీళ్లే ఉన్నాయి. మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో మళ్లీ ప్రజలకు ఫ్లోరైడ్‌ నీరే దిక్కు అవుతోంది. లేదంటే నిత్యం రూ.30 ఖర్చు చేసి 20 లీటర్ల శుద్ధి చేసిన నీటిని వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు.

రోజూ రూ.30 ఖర్చు

గ్రామంలోని బోరు మోటార్లల్లో నేటికి ఫ్లోరైడ్‌ నీరుంది. మిషన్‌ భగీరథ నీటిని తాగుతున్న ప్రజలు, సరఫరా నిలిచిపోయినప్పుడు ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద నిత్యం రూ.30 ఖర్చు చేసి 20 లీటర్ల శుద్ధి చేసిన నీటిని కొనుగోలు చేసి దాహార్తి తీర్చుకుంటున్నారు. గ్రామంలో నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కృషి చేయాలి.

– అరవింద్‌నాయక్‌, సర్పంచ్‌, మంతన్‌గౌరెల్లి

ఇబ్బందేమీ లేదు

మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో తరచూ అంత రాయం జరుగుతుంది వాస్తవమే. కానీ ప్రజలకు ఇబ్బందేమి లేదు. గ్రామా ల్లో బోరుబావుల్లో ఇప్పటికై తే పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. వాటితో దాహార్తి తీర్చుతున్నాం. డివిజన్‌లో 538 బోరుబావుల్లో 80 శాతానికి పైగానే పనిచేస్తున్నాయి. నీటి సరఫరా నిలిచిపోతే ప్రత్నామ్యాయ ఏర్పాట్లు చేస్తున్నాం.

– రాజు, డీఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇబ్రహీంపట్నం

Advertisement
 
Advertisement
Advertisement