అమ్మవారి సొమ్ముకు.. ఈఓ ఎసరు! | - | Sakshi
Sakshi News home page

అమ్మవారి సొమ్ముకు.. ఈఓ ఎసరు!

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

గుట్టుచప్పుడు కాకుండా హుండీ లెక్కింపు

రూ.41,500 నగదు దారి మళ్లింపు

ఈఓపై ఫిర్యాదు చేసిన కమిటీ సభ్యులు

దుద్యాల్‌: కంచె చేను మేసినట్లుగా అమ్మవారి ఆదాయాన్ని ఆలయ అధికారి కొల్లగొట్టాడు. గుట్టుచప్పుడు కాకుండా మీడియా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హుండీ ఆదాయం లెక్కించి అక్రమాలకు పాల్పడిన.. వ్యవహారం ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరిలో జరిగిన పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల అనంతరం ఈ నెల 26న ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఈఓ రాజేందర్‌ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కలిసి హుండిని లెక్కించారు. తొలుత రూ.6,55,934ల ఆదాయం సమకూరిందని, ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో మొత్తాన్ని డిపాజిట్‌ చేసేందుకు ఈఓతో పాటు ఈఓ స్నేహితుడు విజయ్‌ కుమార్‌, ఎండోమెంట్‌ అధికారులు సిద్ధమయ్యారు.

అదనంగా రూ.41,500

లెక్కింపుపై అనుమానం ఉందని, మరోసారి లెక్కించాలని కమిటీ సభ్యులు కోరారు. దీంతో మరోసారి కౌంటింగ్‌ చేయగా.. రూ.41,500లు అదనంగా ఉండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరీక్షించగా.. వాటిని బంద్‌ చేసినట్లు తెలిసింది. కుట్ర పూరితంగా లెక్కలు తప్పుగా చూపారని మండిపడుతూ.. కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.

ముందస్తు ప్రణాళికలో భాగమే

హుండీ లెక్కింపు సమయంలో కెమెరాలు ఆన్‌లో ఉండాలి. కానీ ముందస్తు ప్రణాళికతో వాటిని ఈఓ రాజేందర్‌ రెడ్డి ఆఫ్‌ చేసినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉండవచ్చని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కమిటీ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈఓపై చర్యలకు డిమాండ్‌

అక్రమాలకు పాల్పడిన ఆలయ ఈఓ రాజేందర్‌ రెడ్డిపై విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు బ్యాగరి నర్సిములు, కోడిగంటి వెంకటయ్య, దోరమోని మల్లేశ్‌, ఏదుల నర్సిములు, కొత్తూర్‌ రాములు, సున్నాల లక్ష్మీ రాములు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో రెండు మార్లు హుండీ చోరీ కాగా.. దానిపై ఈఓ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. భక్తులు హుండీలో అమ్మవారికి సమర్పించిన వెండి, బంగారు ఆభరణాల వివరాలను ఈఓ ఇవ్వలేదని కమిటీ సభ్యులు ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement