హోంగార్డు విధులకు ఆటంకం | - | Sakshi
Sakshi News home page

హోంగార్డు విధులకు ఆటంకం

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

నిందితుడికి రిమాండ్‌

శంకర్‌పల్లి: విచారణ నిమిత్తం వెళ్లిన ఓ హోంగార్డుని అడ్డుకొని, అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిని గురువారం మోకిల పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు నాగమల్లేశ్వర్‌రెడ్డి బుధవారం రాత్రి ఓ హత్య కేసు విచారణ నిమిత్తం శంకర్‌పల్లి మండలం గోపులారం గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో మహారాజ్‌పేట్‌ గ్రామానికి చెందిన సందెంపేట రామకృష్ణను విచారిస్తుండగా మద్యం మత్తులో వచ్చిన సందెంపేట హరి హోంగార్డు అడ్డుకొని అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై హోంగార్డు ఉన్నతాఽధికారులు దృష్టికి తీసుకొని వెళ్లగా.. సందెంపేట హరిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి సూచన మేరకు హరిని రిమాండ్‌కి తరలించారు. పోలీసు అధికారులు తమ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఎవరైనా ఆటంకం కల్గించడం, దాడి, దూషించడం, అసభ్యపదజాలం వాడడం చట్టరీత్యా నేరమని సీఐ చెప్పారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని సూచించారు.

నిందితుల అరెస్టుకు రంగం సిద్ధం !

న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ హత్య కేసు

నేడు వివరాలు వెల్లడించనున్న పోలీసులు

నాంపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ (63) హత్య కేసులో నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించనున్నారు. ఈనెల 23న తెల్లవారుజామున నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌పరిధిలో మాసబ్‌ ట్యాంక్‌ శాంతినగర్‌ లో వక్ఫ్‌ బోర్డ్‌ ప్యానల్‌ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు నంబర్‌ ప్లేట్‌ లేని కారుతో ఢీ కొట్టి పరారైన విషయం తెలిసిందే. కేసును సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా పరారైన నిందితులను పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. శుక్రవారం హత్య కేసు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారాలు సూచించండి

సాక్షి, సిటీబ్యూరో: నగరాల్లోని ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి పరిష్కారాలు సూచించాలని ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారు ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బిట్స్‌ పిలానీ క్యాంపస్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రసంగించారు. భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కఠిన చర్యలకు అవకాశం ఉండదని చెప్పారు. ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్స్‌, డిజిటల్‌ పరిష్కారాలు, ఫస్ట్‌,లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ కోసం యాప్స్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. సదస్సులో బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ధర్మరాజన్‌ శ్రీరామ్‌, డీన్‌ ప్రొఫెసర్‌ వి. అరుణాచలం పాల్గొన్నారు.

నరెడ్కో తెలంగాణ, అస్కీ మధ్య ఒప్పందం

సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్థాయి అర్బన్‌ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌ నిర్మాణ రంగంలో సరికొత్త నైపుణ్యాలను పెంపొందించేందుకు ఒక కీలక అడుగు పడింది. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ తెలంగాణ (నరెడ్కో తెలంగాణ), ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (అస్కీ)తోఅవగాహన ఒప్పందం జరిగింది. మౌలిక వసతులు, నిర్మాణ రంగాలలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయి నిపుణులను తయారు చేయడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశ్యమని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు కొప్పుల శ్రీధర్‌ రెడ్డి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement