ప్రైవేట్‌ భూమి ఆక్రమణకు యత్నం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ భూమి ఆక్రమణకు యత్నం

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

పలువురిపై కేసు నమోదు చేసిన

పోలీసులు

హయత్‌నగర్‌: ప్రైవేట్‌ భూమిలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు ఆక్రమించుకోవడానికి యత్నించిన పలువురిపై అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అబిడ్స్‌కు చెందిన రాజవరపు రవి అనే వ్యక్తి అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ గ్రామం సర్వేనంబర్‌ 100లో 14 గుంటల భూమిని 2003లో కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమి ఆయన ఆధీనంలోనే ఉంది. ఈ నెల 26వ తేదీన ఇనాంగూడ గ్రామానికి చెందిన బబ్బూరి శ్రీనివాస్‌గౌడ్‌, బబ్బూరి నవ్యకాంత్‌గౌడ్‌, బబ్బూరి మహేందర్‌గౌడ్‌లతో పాటు మరో 10 మంది రవికి చెందిన భూమిలోకి అక్రమంగా ప్రవేశించి, జేసీబీలతో భూమిని చదును చేయించి ఆక్రమించుకునేందుకు యత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితుడు గురువారం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పైన పేర్కొన్న 13 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కారు ఒకరిది..

నంబర్‌ మరొకరిది

వాహనదారుడిపై కేసు నమోదు..

బంజారాహిల్స్‌: తన కారుకు మరో కారు నెంబర్‌ అమర్చిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఈ నెల 26న జహీరానగర్‌లోని ఓపెన్‌గ్రౌండ్‌లో పార్కు చేసిన వాహనాలను తొలగింపు చేపట్టారు. అక్కడ పార్కు చేసి ఉన్న ఏపీ 37 ఏఆర్‌ 9099 నెంబర్‌ గల మారుతి స్విఫ్ట్‌ కారు యజమాని జశ్వంత్‌కు ఫోన్‌ చేశారు. తాను ఖమ్మం వాసినని, తన కారు తన వద్దే ఉందని..ఆ వాహనం గురించి తనకు తెలియదని చెప్పాడు. ఎవరో తన కారు నెంబర్‌ను ఉపయోగిస్తున్నారని చెప్పాడు. స్థానికంగా ఉండే ఇమ్రాన్‌గౌరీ అనే వ్యక్తి స్విఫ్ట్‌ కారును ఇక్కడ పార్కు చేసినట్లు తెలుసుకున్నారు. విచారణలో ఇమ్రాన్‌గౌరీ అనే వ్యక్తి తన కారు నెంబర్‌ (పీబీ 03ఎన్‌–4993) స్థానంలో వేరొకరి నెంబర్‌ (ఏపీ 37 ఏఆర్‌ 9099)ను అమర్చినట్లు స్పష్టమైంది. దీంతో ఇమ్రాన్‌గౌరీపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement