● ఎకో టౌన్‌షిప్ ఏర్పాటుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన
● క్షేత్రస్థాయిలో గోప్యత
కొత్తూరు: సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు ఏర్పాటు దాదాపు ఖరారైనట్లేనని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 20న ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పాల్గొనడం ప్రచారానికి బలం చేకూర్చుతోంది. వ్యర్థాల నిర్వాహణను శాసీ్త్రయంగా చేపట్టి విద్యుత్ ఉత్పత్తి, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని జవహర్‌నగర్, ఆటోనగర్ డంప్‌సైట్లలో లక్షల టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్ ద్వార శుద్ధి చేస్తున్నట్లు సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్న డంప్‌యార్డులను అభివృద్ధి కేంద్రాలుగా మార్చడానికి జపాన్‌లోని కిటక్యుషు నగర అభివృద్ధిని నమూనాగా తీసుకొని కొత్తగా బండరావిర్యాల, సిద్ధాపూర్ గ్రామాల్లో ఎకో టౌన్‌షిప్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు.
కేంద్రాన్ని నిధులు కోరిన ప్రభుత్వం
సిద్ధాపూర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చెత్తను నిర్వీర్యం చేసే ప్రాజెక్టు ఎకో టౌన్‌షిప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదన పంపింది. సిద్ధాపూర్‌లో టీజీఐఐసీ సేకరించిన పొలాల్లో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని కోరింది. ఈ ప్లాంటులో పొడిచెత్త, ఇతర వ్యర్థాలను శాసీ్త్రయంగా వేరుచేయనున్నట్లు తెలిపారు.
స్పష్టత కరువు
సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు ఏర్పాటు చేస్తున్న విషయం ఇప్పటికీ మండల, జిల్లాస్థాయి అధికారులకు తెలియదంటున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం జాతీయ సమీక్షలో సిద్ధాపూర్‌లో ఎకోటౌన్‌షిప్ ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు ప్రసంగించారు. ఈ విషయం నిజంగానే మండల, జిల్లా అధికారులకు తెలియదా..? డంప్‌యార్డు ఏర్పాటు చేస్తున్నట్లు చెబితే స్థానికులు అడ్డుకుంటారని గోప్యత వహిస్తున్నారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


