అదనపు కలెక్టర్ కిరణ్మయి
ఇబ్రహీంపట్నం రూరల్: మహిళల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించేది లేదన్నారు. పోష్ యాక్ట్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు ధైర్యంగా ఐసీలో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ప్రైవే ట్, ప్రభుత్వ కంపెనీల్లో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు తప్పనిసరి అన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల్లో ఉద్యోగులు, యాజ మాన్యాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా పోష్ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శ్రీలత, డీఆర్‌ఓ శారదాదేవి, లోక్ అదాలత్ పర్మినెంట్ మెంబర్ అమితారాణి, హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యాదగిరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు .
సివిల్ సప్లై జిల్లా అధికారి హరీశ్
మంచాల: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సివిల్ సప్లై జిల్లా అధికారి హరీశ్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. లారీలు రాక రోజుల తరబడి ఇక్కడే నిరీక్షిస్తున్నామని రైతులు ఆయనకు వివరించారు. వర్షాలకు ధాన్యం తడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ఆయన సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాల ని అధికారులకు సూచించారు. ఆయన వెంట డీఎస్‌ఓ వనజాత, సీసీ చంద్రిక, వీఓఏ స్వరూప తదితరులు ఉన్నారు.
కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
తుర్కయంజాల్: కొహెడలో మార్కెట్ నిర్మాణానికి రైతులు వ్యతిరేకిస్తుండటంతో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసనలతో పోలీసులు ఔటర్ సర్వీస్ రోడ్డును ఓ వైపు పూర్తిగా మూసివేసి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. రెండు వైపులా బారికేడ్లు, బందోబస్తు ఏర్పాటు చేసి ఏ ఒక్కరిని లోపలికి అనుమతించడం లేదు. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీడియాను సైతం అనుమతించక.. ఇంత నిర్బంధం విధించి పనులు చేపట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని 108 వాహనాన్ని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ సాహెబ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. రికార్డులు, ఫోన్ కాల్స్ డాటాను పరిశీలించి 108 సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ జిల్లా కార్యనిర్వాహణ అధికారి రాజబాబు, సిబ్బంది ఈఎంటీ కుమార్, పైలట్ రామకృష్ణ పాల్గొన్నారు.
కానిస్టేబుల్‌పై సస్సెన్షన్ వేటు
తాండూరు టౌన్: బాలిక కిడ్నాప్ కేసులో అరెస్టయిన నిందితుడు ఠాణా నుంచి పారిపోయిన ఘటనలో బుధవారం ఓ కానిస్టేబుల్‌పై వేటు పడింది. ఈ నెల 10న ఢిల్లీకి చెందిన ఆదిమ్ అనే వ్యక్తి తాండూరు పట్టణానికి చెందిన ఓ బాలికను కిడ్నాప్ చేశాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అదే రోజు నిందితుడు పోలీసుల కళ్లు గప్పి ఠాణా నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ నరేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పట్టణ సీఐ పరమేశ్వర్ తెలిపారు.


