సెంటర్లలో మగ్గుతోన్న ధాన్యం | - | Sakshi
Sakshi News home page

సెంటర్లలో మగ్గుతోన్న ధాన్యం

May 28 2026 8:49 AM | Updated on May 28 2026 8:49 AM

సెంటర్లలో మగ్గుతోన్న ధాన్యం

ఇబ్రహీంపట్నం: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతోంది. ఒక్కసారిగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం.. లారీల కొరత, మిల్లర్ల నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో వర్షం కురిస్తే ఎలా అని రైతులు దిగాలు చెందుతున్నారు. ఇబ్రహీంపట్నం మార్కెట్‌ యార్డు, రాయపోల్‌, దండుమైలారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులుకాస్తున్నారు. మంగళవారం ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వీచి ఓ మోస్తారు వర్షం కురియడంతో ఒక్కసారిగా కర్షకులు ఆందోళన చెందారు. టార్పాలిన్లు కప్పి ధాన్యం తడవకుండా చూశారు. భారీ వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 28న మార్కెట్‌యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభించగా దొడ్డు రకం 7,001(2,800 క్వింటాళ్లు)బస్తాలు, సన్నాలు 1,533(613 క్వింటాళ్లు) బస్తాలు సేకరించారు. ఇప్పటికి పది లారీల దొడ్డు, రెండు లారీల్లో సన్నాలు (ఒక్కో లోడ్‌లో 290 క్వింటాళ్లు) మాత్రమే తరలించారు. రాయపోల్‌ సెంటర్‌లో 16,011 బస్తాల ధాన్యం సేకరించారు. ఇప్పటికై నా అధికారులు త్వరితగతిన ధాన్యం తరలించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement