సీఎం సభను అడ్డుకుంటాం | - | Sakshi
Sakshi News home page

సీఎం సభను అడ్డుకుంటాం

May 28 2026 8:49 AM | Updated on May 28 2026 8:49 AM

తుర్కయంజాల్‌: పండ్ల మార్కెట్‌ నిర్మాణం పేరిట ప్రభుత్వం అన్యాయంగా తమ భూములు లాక్కోటోందని కొహెడ భూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారు హైకోర్టు న్యాయవాదులతో కలిసి కొహెడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడ సర్వే నంబర్‌167/1లో ఎస్సీ, బీసీలకు చెందిన సుమారు 260 ఎకరాల భూమిని అన్యాయంగా లాక్కునేందుకు ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. 1955, 1958 సంవత్సరాల నుంచి కొహెడకు చెందిన సాదు రంగయ్య, సాదు ఈదయ్య తదితరుల పేర్లు రికార్డుల్లో ఉన్నాయని, 1992 వరకు ప్రభుత్వానికి ప్రతి ఏటా పన్నులు చెల్లించామన్నారు. అధికారులు కొత్తగా ఈ పాసు పుస్తకాలను ఇవ్వకపోవడంతో 2025లో కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్లపై హైకోర్టులో కంటెంట్‌ కేసు వేశామన్నారు. అధికారులు కోర్టుకు జవాబు చెప్పకుండా, పోలీసుల సహకారంతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ పనులను చేపడుతున్నారని ఆరోపించారు. జూన్‌ 3వ తేదీన నిర్వహించనున్న మార్కెట్‌ ప్రారంభోత్సవ పనులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మా భూములను లాక్కుంటున్నారని, ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు సాదు రాములు, యాదగిరి, కృష్ణ, మహేశ్‌, దానయ్య, బుడ్డ జంగయ్య, ఆగమయ్య, పంది సతీశ్‌, శీలం అంగత్‌ తదితరులు పాల్గొన్నారు.

కొహెడ భూ బాధితులు

Advertisement
 
Advertisement
Advertisement