నేర నియంత్రణకు ప్రతీ ఠాణాలో 2–3 ప్రాంతాలుగా విభజన
నేర నియంత్రణే లక్ష్యంగా మల్కాజ్‌గిరి పోలీసులు సరికొత్తగా క్లస్టర్ వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. సేఫ్టీ కాలనీ పేరుతో ప్రతి ఠాణాలో 2–3 ప్రాంతాలను క్లస్టర్లుగా విభజించనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద త్వరలోనే ఉప్పల్ భగాయత్ క్లస్టర్‌లో ఈ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ క్లస్టర్‌లోని నివాసితులకు సైబర్ నేరాలు, మహిళా భద్రత, మాదక ద్రవ్యాల కట్టడి, మానవ అక్రమ రవాణా.. ఇలా అన్ని రకాల నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. కమ్యూనిటీ సహాయంతో క్లస్టర్లలోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. క్లస్టర్‌లోని ప్రతీ ఒక్కరి కదలికలపై నిఘా ఉంటుంది. అనుమానిత వ్యక్తులు, అపరిచితుల రాకపోకలపై ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగుతారని మల్కాజిగిరి పోలీసు కమిషనర్ బడుగుల సుమతి అన్నారు. తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ‘సాక్షి’ఇంటర్వ్యూకు ఇచ్చారు. పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే..
23,861 మంది గృహ కార్మికుల రిజిస్ట్రేషన్
ఇటీవలి నేరాల్లో ఇంటి పనివారి ప్రమేయం వెలుగు చూడటంతో గృహిణులు, వృద్ధులు, పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నివాస భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడానికి ‘మీ సురక్ష’పేరుతో గృహ కార్మికుల నమోదు ప్రక్రియ మొదలు పెట్టాం. ఇళ్లలో పనిమనుషులు, సంరక్షకులు, సహాయక సిబ్బంది, డ్రైవర్లు, క్లీనర్లు.. ఇలా అందరి వివరాలు నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు 23,861 మంది గృహకార్మికుల వివరాలు నమోదయ్యాయి. 44 లక్షల జనాభా ఉన్న మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో 4.21 లక్షల కాలనీలు, అపార్ట్‌మెంట్లున్నాయి. కనిష్టంగా 2 లక్షల మంది రిజిస్ట్రేషన్లు అయితేనే 60 శాతం భద్రతకు గ్యారంటీ ఉంటుంది.
సైబర్ క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్..
సైబర్ నేరాల నియంత్రణ, నేరస్తుల భరతం పట్టేందుకు సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్‌న్స్ యూనిట్ (సీసీఐయూ)ను ఏర్పాటు చేయనున్నాం. సైబర్ నేరాలు చేసి తప్పించుకోలేమని భయం నేరస్తుల్లో కలిగించడమే లక్ష్యంగా ఈ సీసీఐయూ కార్యకలాపాలు సాగిస్తుంది. సైబర్ నేరస్తుల కదలికలు, నెట్‌వర్క్‌పై నిఘా పెట్టడంతోపాటు ఆన్‌లైన్‌లో వారి మూలాలను ట్రాక్ చేయడం, ఆర్థిక లావాదేవీలను ఛేదించడం వంటి అంశాలపై కన్నేసి ఉంచుతారు. కేసుల నమోదు నుంచి విచారణ, దర్యాప్తు విశ్లేషణ, అభియోగ పత్రాల దాఖలు వరకూ ప్రతీ అంశంలోనూ స మర్ధవంతంగా వ్యవహరించడం సాధ్యమవుతుంది.
భూవివాదాల్లో ఎస్‌ఓపీ పాటించాల్సిందే..
భూ వివాద కేసుల్లో ప్రతి పోలీసు ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్‌ఓపీ)ను తూ.చ. తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేశాం. కీసర, అబ్దుల్లాపూర్‌మెట్, జవహర్‌నగర్, శామీర్‌పేట, ఘట్‌కేసర్ వంటి పలు ప్రాంతాల్లో భూ తగాదాలు అధికంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు ఖరీదైన స్థలాల కోసం హత్యలకు సైతం నేరస్తులు వెనుకాడటంలేదు. అన్ని కోణాల్లో పక్కాగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి 20 ఏళ్లుగా పొజిషనల్‌లో ఉన్న యజమానులను బెదిరించేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.
ఎస్‌హెచ్‌ఓలుగా మహిళలకు అవకాశం
బస్టాప్‌లు, రైల్వే, మెట్రోస్టేషన్లు, విద్యా ప్రాంగణాలు, వసతిగృహాల వద్ద మహిళలను వేధించే ఆకతాయిలపై షీ టీమ్స్ ఎళ్లవేళలా నిఘా పెడుతుంది. ఇక నుంచి పదే పదే మహిళలను వేధించే పోకిరీలపై ప్రొఫైల్ షీట్స్ తెరుస్తాం. ప్రతినెలా తల్లిదండ్రుల సమక్షంలో మాస్ కౌన్సెలింగ్ ఇస్తాం. మూడు నెలల్లో మేడిపల్లిలోని నూతన పోలీసు కమిషనరేట్ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాం. సరూర్‌నగర్, బేగంపేటలో భరోసా కేంద్రాలు ఉన్నాయి. కమిషనరేట్‌లోనూ భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. త్వరలో జరగనున్న బదిలీల్లో తొలిసారిగా పలు శాంతిభద్రతల పోలీసుస్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఓ)గా మహిళలకు అవకాశం ఇవ్వనున్నాం.
ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో సీసీ కెమెరాలతో నిఘా
పోకిరీలపై ప్రొఫైల్ షీట్స్.. ప్రతినెలా మాస్ కౌన్సెలింగ్
‘సాక్షి’తో మల్కాజిగిరి తొలి మహిళా కమిషనర్ సుమతి


