న్యాయవాది హత్యకేసులో కీలక నిందితుడు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని రెడ్‌హిల్స్ శాంతినగర్‌లో హత్యకు గురైన వక్ఫ్ బోర్డు ప్యానల్ న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ కేసులో కీలక నిందితుడు కిషన్ సింగ్ అలియాప్ పప్పు చిక్కాడు. ఇతడితో పాటు హత్యకు సుపారీ ఇచ్చిన ఇద్దరిలో ఒకరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో చిక్కిన వారి సంఖ్య ఆరుకు చేరింది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ హత్యకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బర్కత్‌పురకు చెందిన కాంగ్రెస్ నేత, బడాబాబుతో పాటు ఆయన కుమారుడినీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ బడాబాబు మొహిజుద్దీన్‌ను హత్య చేసే బాధ్యతల్ని తన అనుచరులైన తావూస్, మునీర్‌లకు అప్పగించారు. వీళ్లిద్దరూ సుపారీ గ్యాంగ్‌తో పని పూర్తి చేయిస్తేనే ఉత్తమమని భావించి కిషనన్ సింగ్ అలియాస్ పప్పుకు రూ.15 లక్షలు చెల్లించారు. ఇతడు కవాడీగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నానీ, వినయ్, మణిదీప్ ద్వారా పని పూర్తి చేయించాడు. మంగళవారం రాత్రికే బడా బాబుతో పాటు నాని, వినయ్, మణిదీప్‌లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో కిషన్ సింగ్ కదలికలపై సాంకేతిక నిఘా ఉంచారు. అతడు ఓ రైలులో పారిపోతున్నట్లు గుర్తించారు. ఈ సమాచారాన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు (ఆర్పీఎఫ్) అందించి, అతడి ఫొటో పంపారు. ఆ అధికారులు రైలులో ఉన్న కిషన్‌సింగ్‌ను గుర్తించి ఢిల్లీలో పట్టుకున్నారు. నగరం నుంచి బయలుదేరి వెళ్లిన ప్రత్యేక బృందం అతడిని అదుపులోకి తీసుకుని బుధవారం రాత్రి తీసుకువచ్చింది. మరోపక్క తావూస్‌ను సైతం పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పరారీలో ఉన్న మునీర్ కోసం గాలిస్తోంది. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి వెళ్లిన నగర సౌత్ రేంజ్ ఐజీ ఎన్.శ్వేత అదుపులో ఉన్న బడా బాబును సుదీర్ఘంగా విచారించారు. హత్యకు దారి తీసిన కారణాలు, పూర్వాపరాలు తదితరాలపై ఆరా తీశారు. ఆ తర్వాతే ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఒకటిరెండు రోజుల్లో నిందితుల అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది.
ఇబ్రహీంపట్నంలో కారు లభ్యం
ఇబ్రహీంపట్నం: న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్యకు ఉపయోగించిన స్కార్పియో కారు ఇబ్రహీంపట్నం సమీపంలో లభ్యమైంది. నిందితులు ఉపయోగించిన నంబర్ ప్లేట్ లేని స్కార్పియోను బైపాస్ రోడ్డులోని రుచి బార్ వదిలి వెళ్లారు. హత్య జరిగిన రోజే వాహనాన్ని ఇక్కడ వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఆర్పీఎఫ్ సహకారంతో పట్టివేత
సిటీలో దొరికిన ఇంకో నిందితుడు
పరారీలో ఉన్న మరొకరి కోసం వేట


