సాఫీగా సాగేలా చర్యలు
యాచారం: ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో భూ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వారం రోజులుగా యాచారం మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పరిహారం అందజేసి ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్, పట్టా భూముల్లో భూ చదును పనులు, కంపచెట్లు, రాళ్లు, రప్పల తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నాలుగు గ్రామాల్లోనే గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో అత్యధికంగా పది వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూమిని ఫార్మాసిటీకి సేకరించారు. అసైన్డ్ భూములు గుట్టలు, రాళ్లు, రప్పలతో కూడి ఉన్నాయి. ఆయా భూముల్లో వారం రోజులుగా వందకుపైగా జేసీబీలు, ఇటాచీలు, ట్రాక్టర్లు ఇతర యంత్రాలతో టీజీఐఐసీ అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అభివృద్ధి పనులు చేపడుతున్న భూముల వైపు ఆయా గ్రామస్తులను, రైతులను వెళ్లనివ్వడం లేదు.
విధుల్లో డివిజన్ తహసీల్దార్లు
ఫార్మాసిటీ భూ అభివృద్ధి పనుల్లో ఇబ్రహీంపట్నం డివిజన్ తహసీల్దార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. డివిజన్‌లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల తదితర మండలాల తహసీల్దార్లు నిత్యం ఉదయం పనులు ప్రారంభించే సమయం నుంచి సాయంత్రం ముగిసే వరకు అక్కడే ఉంటున్నారు. ఫార్మా భూ అభివృద్ధి పనుల్లో తహసీల్దార్లు ఉండగా, తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు చేసే బాధ్యతలను కలెక్టర్ నారాయణరెడ్డి ఆయ మండలాల ఉప తహసీల్దార్లకు అప్పగించారు.
శంకుస్థాపనలకు రెడీ
ఫార్మాసిటీ భూముల్లో వివిధ కంపెనీలకు భూములు అప్పగించడానికి సర్కార్ సిద్ధమైంది. ఆయా కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని వారికి భూముల అప్పగింతకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో సేకరించిన భూముల్లో 500, వెయ్యి, రెండు వేలు, 2,500 ఎకరాలను బ్లాకులుగా చేసి ప్రముఖ సంస్థలకు అప్పగించేందుకు రెడీ చేస్తున్నారు. నాలుగు గ్రామాల్లో భూమి చదునుగా ఉన్న నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని ఐదు వేల ఎకరాల భూమిని అధికారులు శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక నాలుగు రోజుల క్రితం నక్కర్తమేడిపల్లిలోని భూ అభివృద్ధి పనులను పరిశీలించి, వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జూన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నక్కర్తమేడిపల్లి, కుర్మిద్ద రెవెన్యూ పరిధిలోని భూముల్లో పలు కంపెనీల ఏర్పాటు శంకుస్థాపనలు చేస్తారన్న సమాచారం మేరకు ఉన్నతాధికారులు హడావుడి చేస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల్లోని భూ అభివృద్ధి పనుల పర్యవేక్షణ అంతా సీఎంఓ కార్యాలయం నుంచి సాగుతోందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
ఫార్మాసిటీ భూముల్లో శరవేగంగా చదును పనులు
జేసీబీలు, ఇటాచీలతో నిరంతరం కంపచెట్లు, రాళ్లు, రప్పల తొలగింపు
దగ్గరుండి పర్యవేక్షిస్తున్న టీజీఐఐసీ అధికారులు, తహసీల్దార్లు
జూన్‌లో వివిధ సంస్థలకు అప్పగించేలా సర్కార్ సన్నద్ధం
ఫార్మా భూముల్లో భూ అభివృద్ధి పనులు సాఫీగా జరగడం కోసం తహసీల్దార్లను నియమించాం. రైతులు వెంటనే తమ భూ సమస్యలను స్థానికంగా ఉండే తహసీల్దార్లకు తెలియజేస్తే పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. రైతులకు ఇబ్బంది కలగకుండా డివిజన్‌లోని ఆయా మండలాల ఉప తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించాం.
– అనంత్‌రెడ్డి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం


