● కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూదొందే
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
తుర్కయంజాల్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల బంధం ఫెవికాల్ కంటే బలమైనది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నా అది మాటలకే పరిమితం అని, దొందూ దొందే అని పేర్కొన్నారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి మన్నెగూడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన పార్టీలో చేరిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అమెరికా, ఇరాన్ యుద్ధంతో తలెత్తనున్న పరిణామాల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసేందుకే పొదుపు మంత్రం పాటించాలని చెబితే దానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. రైతుల విషయంలో మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. చివరిగింజ వరకు కొంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అలాంటిది ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కల్లాల్లో నిరీక్షిస్తున్నారని చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఆపలేరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. అవినీతి రహిత పాలన అందించాలంటే బీజేపీకే సాధ్యం అని, యువత పార్టీలోకి చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీలో చేరిన స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ బాసరాజు సురేష్‌కు కండువా కప్పి ఆహ్వానించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాషా, బోసుపల్లి ప్రతాప్, దయానంద్ గౌడ్, బచ్చిగళ్ల రమేష్, ఎలిమినేటి నర్సింహా రెడ్డి, కొత్త రాంరెడ్డి, నోముల కార్తీక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


