పాలమూరు! | - | Sakshi
Sakshi News home page

పాలమూరు!

May 24 2026 11:22 AM | Updated on May 24 2026 11:22 AM

13 ఏళ్ల క్రితం సర్వే

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మళ్లీ కదలిక

ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా అడుగులు

కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి భూసేకరణ

పదమూడేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలమూరు సర్వే కోసం రూ.6.91 కోట్లు కేటాయించింది. నిపుణులు సర్వే చేసి డిజైన్లు రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు 115 టీఎంసీల నీరు కేటాయించారు. పరిగి నియోజకవర్గంలో 45 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వార్లు కట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గండేడ్‌, కుల్కచర్ల మండలాల పరిఽధిలో 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, పరిగి మండలం రావులపల్లి శివారులో 10 టీఎంసీల సామర్థ్యంతో జాయింట్‌గా రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మన జిల్లాలోని 2,46,154 ఎకరాల ఆయకట్టుకు నీరందేలా డిజైన్‌ చేశారు. తదనంతర కాలంలో రాష్ట్రం విడిపోవడం టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక అనేక సార్లు డిజైన్లు మారుస్తూ వచ్చారు. చివరకు జిల్లాకు గ్రావిటీ ద్వారానే నీళ్లిస్తామని ప్రకటించి అది కూడా పూర్తి చేయలేదు. పాలమూరు జిల్లా పరిధిలో రెండు రిజర్వాయర్ల నిర్మాణ పనులు ప్రారంభించినా మన జిల్లాలో గంపెడు మట్టికూడా తీయలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. రీ డిజైన్‌ చేసి జిల్లాకు నీరందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం భూ సేకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు.

వికారాబాద్‌: పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది. నెల రోజుల క్రితం పరిగి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. జిల్లాలో భూ సేకరణ చేపడతామని చెప్పారు. ఆ వెంటనే సీఎంఓ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు కూడా అందాయి. మూడు రోజుల క్రితం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌ అధికారులతో సీఎం సమావేశమై భూ సేకరణ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే విషయమై పరిగి ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ కూడా రెండు రోజల క్రితం ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. భూ సేకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని విన్నవించారు.

జిల్లాకు ఎంతో మేలు

నగరానికి మన జిల్లా సమీపంలో ఉన్నా వ్యవసాయ పరంగా ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నేతల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిన్న చిన్న చెరువులు మినహా చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా లేవు. నదుల ద్వారా సెంటు భూమి కూడా తడవదు. పరిశ్రమలు లేని జిల్లా ఏదైనా ఉందంటే అది వికారాబాదే అని చెప్పవచ్చు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రాజెక్టులను తెరపైకి తేవడం.. ఆ తర్వాత మిన్నకుండి పోవడం నేతలకు పరిపాటిగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చ జరిగింది. పాలమూరు ఎత్తిపోతల పథకం, మూసీ నదిపైనే మాటల యుద్ధం జరిగింది. ఇదిలా ఉండగా పరిగి మండలం సయ్యద్‌పల్లి శివారులో 10 టీఎంసీల సామర్థ్యంతో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబందించి భూసేకరణకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నర లోపు పనులు పూర్తి చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రిజర్వాయర్‌ అందుబాటులోకి వస్తే జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు నీరందనుంది.

ఈ సారైనా పూర్తయ్యేనా?

దశాబ్దాలుగా ప్రధాన ప్రాజెక్టు పనులన్నింటినీ ఏదో ఒక కొర్రీ పెట్టి కొండెక్కస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్వేలు.. రీ డిజైన్లకే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిమితం చేశారు. ఉమ్మడి జిల్లాకు 50 టీఎంసీల కేటాయింపులున్న ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం రీడిజైన్‌ పేరుతో అటకెక్కించింది. ప్రస్తుతం జిల్లా నుంచి సీఎం ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ప్రాజెక్టులు పూర్తవుతాయని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement