షాద్‌నగర్‌రూరల్: తెల్లవారుజామున ఏటీఎంలో దుండగులు దోపిడీకి యత్నించిన ఘటన షాద్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మహబూబ్‌నగర్ రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున దొంగలు చోరీకి యత్నించారు. ఏటీఎం కేంద్రానికి ఉన్న షెటర్‌ను, అద్దాలను ధ్వంసం చేశారు. విషయాన్ని గుర్తించిన ఓ యువకుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే దొంగలు పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సీతారాం తెలిపారు.
అబ్దుల్లాపూర్‌మెట్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని బలిజగూడకు వెళ్లే దారిలో ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు శఽనివారం ఉదయం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. మృతుడికి సుమారు 40–45 ఏళ్ల వయసు ఉంటుందని, యాచకుడై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 28న జరిగే పరీక్షలు వాయిదా వేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శశికాంత్ శనివారం తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా 28న ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ఆ రోజు జరిగే పరీక్షలను వాయిదా వేశామన్నారు. పరీక్షలు నిర్వహించే తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు.


