ఇబ్రహీంపట్నం: క్రైస్తవుల శ్మశానవాటికలకు స్థలాన్ని కేటాయించి, సమస్యను పరిష్కరించాలని క్రిష్టియన్ అసోసియేషన్ పాస్టర్లు డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ క్రిష్టియన్ పాస్టర్ అసోసియేషన్ కో–ఆర్డినేటర్ చెరుకూరి రాజు, విక్టర్ సన్నుత్, పాస్టర్లు కరుణాకర్, దేవకుమార్, సైమన్ పీటర్‌లు మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని నలువైపులా పది ఎకరాల చొప్పున శ్మశానవాటికలకు స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించారు. శ్మశానవాటికలు లేక క్రిస్టియన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్రైస్తవ సమాజం ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. క్రైస్తవుల అభ్యున్నతికి వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం తమకు సహాయసహకారాలు అందిస్తుందని, అదేవిధంగా శ్మశాన వాటికలకు ఆయా ప్రాంతాల్లో భూమిని కేటాయించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి, క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్‌జాన్‌లు ప్రత్యేక దృష్టిని సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, పాస్టర్లు మధుకర్, ఆశీర్వాదం, శ్రీను, మహేందర్, కృష్ణపాల్, మోషే, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
క్రిష్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు


