రాజేంద్రనగర్ : ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన డెకరేషన్ సామగ్రి గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గోదాంతో పాటు పక్కనే ఉన్న రిటైర్డ్ ఎస్సై ఇంటి మొదటి, రెండో అంతస్తులోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. పోలీసులు తెలిపిన మేరకు.. శివరాంపల్లి ప్రాంతంలోని మహేందర్ రెడ్డి ఖాళీ స్థలంలో పాతబస్తీకి చెందిన జంగీర్ డైమండ్ డెకొరేషన్ సామగ్రి పేరిట గోదాం నిర్వహిస్తున్నాడు. భారీ షెడ్డు వేసి ఇందులో డెకరేషన్ కు సంబంధించిన వస్తువులను నిల్వ చేస్తున్నాడు. ఇక్కడినుండే ఆర్డర్లపై తరలించి తిరిగి గోదాంలో భద్రపరుస్తుంటాడు. శనివారం రాత్రి గోదాంకు సిబ్బంది తాళం వేసి వెళ్లారు. ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో గోదాం నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభించాయి. నిమిషాల వ్యవధిలో గోదాం పూర్తిగా మంటలు వ్యాపించాయి. డెకరేషన్ సామగ్రి వివిధ రకాల ప్లాస్టిక్ తో పాటు ఫైబర్ తయారీవస్తువులు ఉండడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. గోదాం పూర్తిగా వ్యాపించాయి.ఈ మంటలు పక్కనే ఉన్న రిటైర్డ్ ఎస్సై జీవన్ దాస్ నివాసానికి తాకాయి. మొదటి అంతస్తుతోపాటు రెండో అంతస్తు లో ఉన్న వస్తువులు కాలిబూడిదయ్యాయి. ఆ ఇంట్లో నివాసమున్న వారు వెంటనే కిందకురావడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. స్థానికులు విషయాన్ని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. ఉదయం నిద్ర నుండి లేచాం కాబట్టి ప్రాణాలతో బతికి బయటపడ్డాం.. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగి ఉంటే మా పరిస్థితి ఏమిటని రిటైర్డ్ ఎస్సై జీవన్ దాస్ బోరుమన్నాడు.


