షాద్‌నగర్‌రూరల్: పట్టా లు దాటుతున్న మహిళకు ప్రమాదవశాత్తు రైల్వేట్రాక్ మిషన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చటాన్‌పల్లి రైల్వేగేట్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వర్ కథనం ప్రకారం.. పట్టణంలోని రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మునావత్ గోరీ (56) కూరగాయలు తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పి ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయలుదేరింది. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైల్వేట్రాక్ మిషన్ తగలడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. స్టేషన్ మాస్టర్ ఠాగూర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తక్కువ ధరకు ఇల్లు ఇప్పిస్తామంటూ మోసం
హయత్‌నగర్: తక్కువ ధరలో ఇంటిని ఇప్పిస్తామని లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్ పోలీసులు తెలిపిన మేరకు.. హయత్‌నగర్ సీతారాంపురం కాలనీకి చెందిన ఐతరాజు ఆంజనేయులుకు కుంట్లూర్‌లో ఓ ఇంటిని రూ. 27.50 లక్షలకు ఇప్పిస్తామని మధ్యవర్తులు ఐతరాజు శంకరయ్య, ఆడెపు రాజు, వడ్ల మురళి, పెండెం శివ, మధుసూదన్‌లు నమ్మించారు. ఇందుకు ముందుగా అడ్వాన్సు తీసుకున్నారు. అనంతరం పలు దఫాలుగా రూ. 23 లక్షలు వసూలు చేశారు. అయినా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేశారు. ఆంజనేయులు గట్టిగా అడగడంతో మీరు ఇచ్చిన డబ్బును ఇతర రెండు ప్లాట్లలో పెట్టుబడి పెట్టామని నమ్మించారు. ఇందుకోసం అతని వద్ద మరో రూ.20 లక్షలు వసూలు చేశారు. అయినా ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. మోసపోయానని తెలుసుకున్న ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఐతరాజు శంకరయ్య, ఆడెపు రాజులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
గృహిణి ఆత్మహత్య
రాజేంద్రనగర్: కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ గృహిణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పల్లవి (20) శ్రీనివాస్ భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. గోల్డెన్ హెడ్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా పల్లవిని శ్రీనివాస్ పట్టించుకోవడం లేదు. మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇదే విషయమై పల్లవి పలుమార్లు ప్రశ్నించింది. విషయాన్ని కుటుంబ పెద్దలకు సైతం చెప్పింది. దీంతో శ్రీనివాస్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐతరాజు శంకరయ్య ఆడెపు రాజు


