మణికొండ: శాస్త్రజ్ఞానంతో కూడిన ధర్మమే సనాతన ధర్మమని ఇస్కాన్ టెంపుల్ బంజారాహిల్స్ ఉపాధ్యక్షుడు సహదేవదాస ప్రభూజీ అన్నారు. సనాతన ధర్మ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని కనుమరుగు చేసేందుకు గజినీ, బాబార్, అక్బర్, ఔరంగజేబుతో పాటు ఆంగ్లేయులు ఎన్నెన్నో దాడులు, కుతంత్రాలు చేశారని ఈ దాడులను తట్టుకుని మన పూర్వీకులు మన ధర్మాన్ని కాపాడుకుంటూ వచ్చారన్నారు. వారి త్యాగాలు, పోరాటలతోనే మన సంస్కృతి నిలిచిందని తెలిపారు. ఈ చరిత్రను ఇప్పుటి పిల్లలు, యువతకు తెలియజేసి వారిని జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంచవటికాలనీ పార్కులో ఆదివారం రాత్రి నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆర్‌ఎస్‌ఎస్ భాగ్యనగర్ విభాగ్ ప్రముఖ్ అచ్యుత్, రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మీ, సమ్మేళన సమితి అధ్యక్షుడు బస్వరాజుతో కలిసి ఆయన ప్రసంగించారు.
18 కులాలు మాత్రమే ఉండేవి...
ప్రపంచంలోనే అతి పురాతన ధర్మం హిందూ ధర్మమని అన్నారు. గతంలోనే మన దేశం విశ్వగురువుగా ఉండేదన్నారు. మధ్యలో వచ్చిన ఆక్రమణదారులు మన దేవాలయాలను ధ్వంసం చేసి సంపదను దోచుకెళ్లారని అన్నారు. ఆంగ్లేయులు మన సంస్కృతిని నాశనం చేసే కుట్రలు చేశారన్నారు. మన ధర్మంలో కేవలం 18 కులాలు మాత్రమే ఉండేవని ఆంగ్లేయులు వాటిని 10 వేల కులాలుగా విభజించి మనల్ని ఐక్యత లేకుండా చేశారని తెలిపారు. మన దేశానికి చెందిన అనేక ధార్మిక సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం గురుంచి ప్రచారం చేస్తోందన్నారు. విదేశీయులు సనాతన ధర్మం వైపు ఆకర్షితులై మన ధర్మాన్ని ఆచరిస్తున్నారని అన్నారు.
● మన అఖండ భారతదేశంలో గతంలో హిందూ ధర్మమే ఉండేదని ఆక్రమణదారులతో విభిన్న మతాలతో అవి దేశాలుగా విడిపోయాయని తెలిపారు. హిందువుల్లో ఐక్యత పెరిగి, ఒకరికొకరు సహరించుకుని పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సామూహిక హనుమాన్ చాలీసా పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ కె. నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు డి.సీతారాం, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎం.రాఘవరెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున హిందువులు పాల్గొన్నారు.


