‘పైసా బారీష్‌’లో ఇద్దరు నిందితులకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

‘పైసా బారీష్‌’లో ఇద్దరు నిందితులకు రిమాండ్‌

Apr 12 2026 6:41 AM | Updated on Apr 12 2026 6:41 AM

షాద్‌నగర్‌రూరల్‌: పైసా బారీష్‌ పేరిట మోసం చేసిన ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. శనివారం పట్టణంలోని ఠాణాలో సీఐ సీతారాం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏసీపీ లక్ష్మీనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్‌టీఆర్‌ జిల్లా కంచికర్ల గ్రామానికి చెందిన మక్బూల్‌భాషాకు మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు కృష్ణద్వారా హైదరాబాద్‌కు చెందిన కోటేశ్వర్‌రావు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో కోటేశ్వర్‌రావు ఈ నెల 2న వేణు, రామ్మోహన్‌, మక్బూ ల్‌ బాషను కాన్ఫరెన్స్‌లో పెట్టి మీరు రూ.10 లక్షలు తీసుకువస్తే రూ.30 లక్షలు ఇస్తామని నమ్మబలికాడు. డబ్బులు తీసుకొని షాద్‌నగర్‌కు రావాలని చెప్పాడు. మీకు అంత డబ్బు ఎక్కడినుండి వస్తుందని మక్బూల్‌బాష కోటేశ్వర్‌రావును ప్రశ్నించగా గురుస్వాములు పూజలు చేస్తే పైసా బారీష్‌(డబ్బుల వర్షం) కురుస్తుందని నమ్మించారు. దీంతో మక్బూల్‌బాష రూ.9లక్షలు తీసుకుని తన స్నేహితులతో కలిసి కారులో షాద్‌నగర్‌కు బయలుదేరాడు. రాత్రి షాద్‌నగర్‌లోని బస్టాండ్‌ వద్దకు వచ్చిన మక్బూల్‌బాష వేణు, రామ్మోహన్‌తో కలిసి కారులో సీఎస్కే విల్లాస్‌ సమీపంలోకి రాగానే రామ్మోహన్‌కు బ్రహ్మయ్య అలియాస్‌ అన్నారెడ్డి ఫోన్‌ నుంచి రవి అలియాస్‌ మధు లొకేషన్‌ పిన్‌ పెట్టాడు. లొకేషన్‌ద్వారా సీఎస్కే విల్లాస్‌ గేట్‌ వద్దకు వెళ్లగానే ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి అన్న పంపిండు అని చెప్పి వారిని విల్లా లోపలికి తీసుకువెళ్లాడు. బైక్‌పై వచ్చిన వ్యక్తి వారిని విల్లాలోని ఒక గదిలో కూర్చోబెట్టి డబ్బులు చూపమని అడగడంతో మక్బూల్‌బాష తన బ్యాగులో ఉన్న రూ.9 లక్షల నగదు చూపించాడు. రామ్మోహన్‌ ఫోన్‌లో మాట్లాడుతుండగా నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి అక్కడికి వచ్చారు. నీ దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వాలని, లేదంటే చంపుతామని బెదిరించి డబ్బులను తీసుకొని పారిపోయారు. విల్లాలోకి తీసుకువచ్చిన గుర్తుతెలియని వ్యక్తి రామ్మోహన్‌ ఫోన్‌ గుంజుకొని విల్లా బయట నుంచి గడిపెట్టి పారిపోయాడు. ఈ ఘటనపై ఈ నెల 3న మక్బూల్‌బాష పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు బ్రహ్మయ్య అలియాస్‌ అన్నారెడ్డి, మహేశ్‌ అలియాస్‌ మధుసూదన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. రవి అలియాస్‌ మధుతో పాటు మరో నలుగురు గ్యాంగ్‌ పథకం ప్రకారం అమాయక ప్రజలను దోచుకుంటారని పోలీసులకు వివరించారు. నిందితుల నుంచి రూ.6లక్షలు నగదు, ఓ కారు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ఫ్యూచర్‌సిటీ కమిషనర్‌ సుధీర్‌బాబు, డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పట్టణ సీఐ సీతారాం, రూరల్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసును ఛేధించారు. కేసును ఛేదనలో ముఖ్యపాత్ర పోషించిన క్రైం డీఎస్‌ఐ శివారెడ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్‌ సిబ్బంది రవీందర్‌, బాల్‌రాజ్‌, మోహన్‌, కరుణాకర్‌, జాకీర్‌, రాజు, సంతోశ్‌ అభినందించారు. వారికి తగిన రివార్డులను ఇప్పిస్తామని ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు.

పరారీలో మరో ఐదుగురు

కారు, రూ.6లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం

కేసు వివరాలను వెల్లడించినఏసీపీ లక్ష్మీనారాయణ

Advertisement
 
Advertisement
Advertisement