అభివృద్ధిలో భాగం కావాలి
సద్వినియోగం చేసుకోండి
షాద్‌నగర్: కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లపై మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి ఎర్లీ బర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్తిపన్ను క్రమం తప్పకుండా చెల్లించే వారికి ప్రభుత్వం ఐదు శాతం రాయితీ కింద ఊరట కల్పిస్తోంది. ఈనెల 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆస్తిపన్ను మదింపు డిమాండ్ ఇంటి నంబర్ల వారీగా మున్సిపల్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ఈనెల 30 వరకే అవకాశం
రాబోయే సంవత్సరానికి ముందుగా చెల్లించిన దానికి మాత్రమే ఐదు శాతం రాయితీని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈనెల 30వ తేదీలోపు చెల్లించే వారికే ఈ రాయితీ అవకాశం వర్తిస్తుంది. ఈ మేరకు అధికారులు ఎర్లీబర్డ్ పథకం కింద పన్నులు వసూలు చేస్తున్నారు. ముందస్తు పన్నులు చెల్లించిన వారిని అధికారులు సత్కరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. రాయితీ ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రతి మున్సిపాలటీలో పన్ను మేళాలు నిర్వహిస్తున్నారు. పన్ను చెల్లింపులను మెరుగుపరిచేందుకు కమిషనర్లు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం బకాయిలు ఉన్నట్లయితే వాటిపై ఎలాంటి రాయితీ వర్తించదు. బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించిన తర్వాతే ప్రస్తుత ఏడాది రాయితీ పొందే అవకాశం ఉంటుంది.
వీరే అర్హులు
గత ఆర్థిక సంవత్సరంలో నివాస, నివాసేతర ఆస్తులపై ఎలాంటి బకాయి లేకుండా పన్ను పూర్తిగా చెల్లించిన వారు ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీ బర్డ్ పథకానికి అర్హులు. రాయితీ పొందాలనుకునే వారు గతేడాది తమ ఆస్తి పన్నును పూర్తిగా చెల్లించి ఈ ఏడాదికి సంబంధించి ముందస్తుగా చెల్లిస్తే వారికి కూడా రాయితీ ఇవ్వనున్నారు.
మున్సిపాలిటీల బలోపేతానికి..
మున్సిపాలిటీలకు సాధారణ నిధి కింద వచ్చే నల్లా పన్నులతో పాటుగా దుకాణాల అద్దె, వర్తక పన్ను, వాణిజ్య ప్రకటనలపై వచ్చే ఆదాయంతో పోలిస్తే ఆస్తి పన్ను ఎంతో కీలకం. మున్సిపాలిటీల నిర్వహణ ఖర్చుకు అవసరమైన సాధారణ నిధి సమీకరణకు కోసం ఈ పథకానికి మున్సిపల్ శాఖ శ్రీకారం చుట్టింది. ఎర్లీ బర్డ్ పథకం ద్వారా పురపాలక సంఘాలు ఆర్థికంగా బలపడనున్నాయి. ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం కల్పించి ముందస్తుగా ఆస్తి పన్ను రాబట్టే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపుపై డిస్కౌంట్
ఎర్లీబర్డ్ పథకంతో వసూలుకు కసరత్తు
ఈనెల 30లోపు ఐదు శాతం రిబేటు
ముందస్తు చెల్లింపుదారులకు సత్కారాలు
ముందస్తు పన్నులు చెల్లించే వారికి మున్సిపల్‌శాఖ ఐదు శాతం రిబేటు అందిస్తోంది. ఇళ్లు, దుకాణాల యజమానులు రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. పన్నులు చెల్లించి ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
– అగ్గునూరు బస్వం, చైర్మన్, షాద్‌నగర్
మున్సిపల్‌శాఖ ముందస్తు పన్ను చెల్లించే వారికి ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో ఐదు శాతం పన్ను రాయితీ ఇవ్వనుంది. మున్సిపల్ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్ ద్వారా ముందస్తు పన్నులు చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకోవచ్చు. గడువు దాటితే వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది.
– సునీత, కమిషనర్, షాద్‌నగర్


