తుర్కయంజాల్: పంటలకు మద్దతు ధర దక్కేలా గ్యారంటీ చట్టం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి డిమాండ్ చేశారు. అఖిల భారత కిసన్‌సభ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆదిబట్ల సర్కిల్ పరిధి కొహెడలోని సురవరం సుధాకర్ రెడ్డి కాలనీలో రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1936 ఏప్రిల్ 11న మొదటిసారి లక్నోలో అఖిల భారత కిసాన్ సభను నిర్వహించారని గుర్తుచేశారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దుచేయాలని, గ్రామీణ ఉపాధి పథకాన్ని అర్హులందరికీ వర్తింపచేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉప సంహరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను వెంటనే పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బి.ఎల్లేష్, ఎస్.కె.ముజీబ్, ఆర్.దేవేందర్, పద్మ, అండాలు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ప్రొసీడింగ్స్ వెంటనే అందించాలని ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు గుర్రం ఇంద్రసేనారెడ్డి, పీఆర్‌టీయూ మండల శాఖ అధ్యక్షుడు వరకాల పరమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిశారు. స్పందించిన ఆయన వెంటనే జిల్లా రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి తక్షణమే ప్రొసీడింగ్స్ అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాలల అసోసియేషన్ నాయకుడు రవికుమార్, థర్డ్ బెటాలియన్ పోలీస్ అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.
మహేశ్వరం: మండలంలోని బాలికల గురుకుల కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఈమని శ్రీలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మే 13న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని 10వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మంచాల: పాడి రైతులకు పశువుల పెంపకంపై మరింత అవగాహన కల్పించి ప్రోత్సహించాలని పశు సంవర్థక శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ సుబ్బారాయుడు అన్నారు. మండలంలోని ఆరుట్ల, మంచాల పశు వైద్యశాలలను శనివారం ఆయన సందర్శించారు. పశువైద్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరా తీశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మంచాల, ఆరుట్ల పశు వైద్యశాలల వైద్యులు సుధారెడ్డి, వనజ కుమారి, పశుసంవర్థక శాఖ రిటైర్డ్ జిల్లా అఽధికారి అనిల్ కుమార్, సిబ్బంది శివ, శ్రీశైలం, జశ్వంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.


