ఫర్నిచర్‌ గోదాంలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఫర్నిచర్‌ గోదాంలో అగ్ని ప్రమాదం

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

ఫర్నిచర్‌ గోదాంలో అగ్ని ప్రమాదం

పక్కనే పెట్రోల్‌ బంక్‌

మంటలు అదుపు చేసిన ఫైర్‌ సిబ్బంది

తప్పిన పెను ముప్పు

మొయినాబాద్‌: మొయినాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నిచర్‌ గోదాంలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న పెట్రోల్‌ బంక్‌ ఆఫీస్‌, ప్రహరీలకు అంటుకున్నాయి. రెండు గంటల పాటు శ్రమించి ఫైర్‌ సిబ్బంది మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మొయినాబాద్‌లోని సురభి వెంచర్‌లో అమిత్‌ హౌజాకు చెందిన సుమిత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఫర్నిచర్‌కు సంబంధించిన రెండు గోదాంలు ఉన్నాయి. చైనా నుంచి ఫర్నిచర్‌, సీలింగ్‌ లైట్స్‌ దిగుమతి చేసుకుని గోదాంలలో నిల్వ చేసి ఇక్కడి నుంచి షోరూంలకు తరలిస్తారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఫర్నిచర్‌ మెటీరియల్‌కు అంటుకుని పెద్ద ఎత్తున పొగ, మంటలు ఎగిసిపడ్డాయి. గోదాం పక్కనే ఉన్న పెట్రోల్‌ బంక్‌ ఆఫీస్‌ గోడలు, ప్రహరీలకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో చేవెళ్ల నుంచి ఒక ఫైరింజన్‌, లంగర్‌హౌస్‌ నుంచి రెండు ఫైరింజన్లు ఘటనా స్థలనానికి చేరుకున్నాయి. ఫైర్‌ సిబ్బంది సుమారు రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెట్రోల్‌ బంక్‌కు ప్రమాదం తప్పింది. గోదాంలో మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కలవారంతా భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. గోదాం పూర్తిగా కాలిపోయింది. అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటా లేదా ఇంక ఏదైనా కారణమా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement