యాచారం: ఫార్మాసిటీలో కోల్పోయే భూమికి భూమి ఇప్పించి ఆదుకోవాలని ఫార్మాసిటీ భూ బాధితులు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని చౌదర్‌పల్లి గేట్ వద్ద ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వారిని శనివారం తాడిపర్తి, నానక్‌నగర్, కుర్మిద్ద గ్రామాల మాజీ సర్పంచ్‌లు దూస రమేష్, ముత్యాల వెంకట్‌రెడ్డి, బందె రాజశేఖర్‌రెడ్డి, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నేతలు గణేశ్ మహేందర్‌రెడ్డి తదితరులు కలిశారు. మండలంలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన 2,200 ఎకరాల పట్టా భూమిని ఫార్మాసిటీకి తీసుకుంటున్నట్లు ప్రకటించి రైతుల పేర్లు తొలగించి, టీజీఐఐసీ పేరు మీద మార్చేశారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ భూముల్లో పర్యటించిన ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూములు మీకు దక్కేలా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో చర్చించి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి న్యాయం చేసేలా కృషి చేస్తానని ఎంపీ రైతులకు హామీ ఇచ్చారు.


