మొయినాబాద్: ప్రభుత్వం ద్వారా ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా సివిల్ సప్‌లై ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. 155.40 క్వింటాళ్ల రేషన్ బియ్యంతోపాటు మూడు వాహనాలను సీజ్‌చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని ముర్తూజగూడ సమీపంలో ఉన్న ఓ గోదాంలో పీడీఎస్ (రేషన్) బియ్యం నిల్వ చేసి, ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు లారీలో లోడ్ చేస్తున్నట్లు శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ టాస్క్‌ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది. ఉదయం 11 గంటల సమయంలో గోదాంపై దాడి చేశారు. లారీలో మొత్తం 366 బస్తాల్లో 155.40 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీ స్థానికుల నుంచి కిలో రూ.12కు కొనుగోలు చేసి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. బియ్యంతోపాటు మూడు వాహనాలను సీజ్ చేసి చేవెళ్ల ఎంఎల్‌ఎస్ కేంద్రానికి తరలించారు. మహమ్మద్ షఫీతోపాటు గుజరాత్‌కు చెందిన లారీ డ్రైవర్ అస్లాం, మరో వాహన డ్రైవర్ రాజా నర్సాని, కూలీ రామ్ కిషన్, గోదాం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పహాడీషరీఫ్‌లో..
పహాడీషరీఫ్: బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న ఎనిమిది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పహాడీషరీఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ బీఎల్‌ఎన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వాజిద్ అనే వ్యక్తి లబ్ధిదారుల నుంచి తక్కువ ధరలో బియ్యం కొనుగోలు చేసి అవసరమైన వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ బియ్యాన్ని రామ్ జీవన్ సాని (52) అనే వ్యక్తి ట్రాలీలో తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 16 సంచుల్లో ఉన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, అతన్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


