ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం!

Apr 11 2026 9:16 AM | Updated on Apr 11 2026 9:16 AM

ఇదీ లెక్క

జిల్లాలో 38 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం

‘సాక్షి’తో పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ హరీశ్‌

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘యాసంగి కోతలు ప్రారంభమయ్యాయి. మార్కెట్లోకి వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లే కొనుగోలు చేసి, గోదాములు, ఎంపిక చేసిన రైస్‌ మిల్లుల్లో నిల్వ చేయనున్నాం. ఇందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం. భగ్గున మండుతున్న ఎండలను, ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్లలో పలు మౌలికసదుపాయాలు సైతం సమకూర్చుతున్నాం. రైతులకు ఏ చిన్న సమస్య తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం’అని పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ జె.హరీశ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం శ్రీసాక్షిశ్రీతో మాట్లాడారు.

40 వేల మెట్రిక్‌ టన్నులే లక్ష్యం

యాసంగి సీజన్‌లో జిల్లాలో 1.27 లక్షల ఎకరాల్లో పంటసాగైంది. దీనిలో 87,344 ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. మొత్తం 50 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశాం. రైతుల ఇంటి అవసరాలు పోగా మిగిలిన 40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పీఏసీఎస్‌, ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పది లక్షల గోనే సంచులు అవసరం కాగా, ఇప్పటికే 3.50 లక్షల సంచులను సిద్ధం చేశాం.

తొమ్మిది రైసు మిల్లులకు చేరవేత

పీఏసీఎస్‌, ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది రైస్‌ మిల్లులకు పంపుతుంది. క్వింటాల్‌ రారైస్‌కు రూ.10 మిల్లింగ్‌ చార్జీ చెల్లిస్తుంది. బాయిల్డ్‌ రైస్‌కు రూ.20 చొప్పున చెల్లిస్తుంది. మిల్లర్లు క్వింటాల్‌ ధాన్యానికి 67 కేజీల రారైస్‌, బాయిల్డ్‌ రైస్‌ 68 కేజీలు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఇలా సేకరించిన బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది.

నాణ్యతను బట్టి ధర

ధాన్యం కొనుగోలులో నాణ్యత నిర్ధారణ పక్కగా నిర్ణయిస్తారు. తేమ 17 శాతం లోపు ఉండాలి, తాలు మూడు శాతం, మట్టి పెల్లలు ఒక శాతం, ఇతర రకాల గింజలు ఆరు శాతం, డ్యామేజీ ఐదు శాతం మించకూడదు. అంతకు మించిన ధాన్యానికి ఆశించిన ధర దక్కదు. సాధ్యమైనంత వరకు రైతులే తమ ధాన్యాన్ని గ్రేడింగ్‌ చేసుకోవాలి. మార్కెట్‌కు వచ్చే ముందు తాలు, రాళ్లు, మట్టి వంటివి లేకుండా చూసుకోవాలి. అప్పుడే వారికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర లభిస్తుంది.

మౌలిక సదుపాయాలు తప్పనిసరి

కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం తాగునీరు, ఎండ నుంచి ఉపశమనం కోసం టెంట్లు, ధాన్యం క్వింటాల్‌ ధరలతో పాటు కంట్రోల్‌రూం నంబర్‌తో ఒక బ్యానర్‌ను ఏర్పాటు చేయాలి. ధాన్యం నాణ్యత పరిశీలన, కొనుగోలు, రికార్డుల నమోదు అంశంపై ఇప్పటికే ఐకేపీ కేంద్రాల మహిళలకు శిక్షణ పూర్తి చేశాం. అకాలవర్షానికి ధాన్యం తడిసిపోకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్పాలిన్లు సిద్ధం చేశాం.

జిల్లాలో వరిసాగు 87,344 ఎకరాలు

వానాకాలంలో ధాన్యం సేకరణ లక్ష్యం 30 వేల మెట్రిక్‌ టన్నులు

మార్కెట్‌కు వచ్చిన ధాన్యం 14,800 మెట్రిక్‌ టన్నులు

యాసంగిలో ధాన్యం సేకరణ లక్ష్యం 40 వేల మెట్రిక్‌ టన్నులు

అవసరమైన గన్నీ బ్యాగులు 10 లక్షలు

ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి 3.5 లక్షలు

మొత్తం కొనుగోలు కేంద్రాలు 38

Advertisement
 
Advertisement
Advertisement