ఉల్లి నేలచూపులు | - | Sakshi
Sakshi News home page

ఉల్లి నేలచూపులు

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

వికారాబాద్‌: నెల రోజులుగా ఉల్లి రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ధర అమాంతం పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. క్వింటాలు ధర రూ.800లకు పడిపోయింది. 60 కిలోల ఉల్లి బ్యాగు రూ.450 నుంచి రూ.500 చొప్పున అమ్ముడవుతోంది. రెండు నెలల క్రితం వరకు కిలో రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలికింది. ఇప్పుడు పూర్తిగా క్షీణించింది. నాడు వినియోగదారులకు కన్నీళ్లు పెట్టించిన ఉల్లి నేడు రైతుకు కన్నీరు పెట్టిస్తోంది.

ఆశలు ఆవిరి

ఈ సారి ఉల్లి దిగుబడి బాగుండటంతో కష్టాలు తీరుతాయని రైతులు భావించారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పూర్తిగా పడిపోవడంతో వారి ఆశలు ఆవిరాయ్యాయి. పెట్టుబడులు కూడా రావడంలేదంటూ లబోదిబో మంటున్నారు. రెండు నెలల క్రితం క్వింటాలు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు విక్రయించారు. చిల్లరగా కిలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయించారు. కానీ ఒక్కసారిగా ధర పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్తే నష్టాలు తప్ప ప్రయోజనం లేదని భావించిన రైతులు ట్రాక్టర్లలో గ్రామాలు తిరుగుతూ విక్రయిస్తున్నారు.

పెరిగిన సాగు

జిల్లాలో ఈ సారి ఉల్లి సాగు విస్థీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో మూడు వేల ఎకరాల్లో సాగు చేయగా ఈ సారి 4,500 ఎకరాల్లో ఉల్లి పంట వేశారు. గతంలో ఎకరాకు 80 క్వింటాళ్ల దిగుబడి రాగా ఈ సారి 100 నుంచి 130 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. హైబ్రీడ్‌ రకాల సాగు చేయటంతో దిగుబడి పెరిగినట్లు ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు.

కంటితుడుపు చర్యలు

ధరలు పెరిగిన ప్రతిసారీ ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది. శాశ్వత పరిష్కారం చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు రాయితీపై విత్తనాలు ఇచ్చారు.. ప్రస్తుతం అది కూడా అమలు చేయడం లేదు. గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని పలువురు ఆరోపిస్తున్నారు.

దిగుబడి బాగున్నా ధర లేక దిగాలు

క్వింటాలు రూ.800 నుంచి

రూ.900 లోపే..

ప్రతి సీజన్‌లో ఇదే పరిస్థితి

నష్టాల ఊబిలో రైతన్న

Advertisement
 
Advertisement
Advertisement