అవినీతి తిమింగలాలు | - | Sakshi
Sakshi News home page

అవినీతి తిమింగలాలు

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

బడంగ్‌పేట్‌: పార్టీ సిద్ధాంతాలు వేరైనా.. ప్రజాసమస్యల పరిష్కారంలో విభేదాలున్నా.. అవినీతి విషయంలో మాత్రం ఆ కార్పొరేటర్లందరూ సయోధ్యతో ముందుకెళ్లారు. బడంగ్‌పేట కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేటర్లు కుమ్మకై ్క రూ.122 కోట్ల మేర అవినీతికి తెరలేపారనే చర్చ సాగుతోంది. 32 మంది కార్పొరేటర్లలో ఐదారుగురు మాత్రమే అవినీతి మరకలు అంటించుకోలేదని తెలుస్తోంది. మిగిలిన వారంతా రూ.కోట్లకు పడగలెత్తారని, చివరికి ఆ ఉచ్చులో పడి 10 మంది అధికారులు బలైన విషయం తెలిసిందే. రూ.లక్షల జీతాలు తీసుకుంటూ అందినకాడికి లంచాలు తీసుకున్న అధికారులకు సస్పెన్షన్‌లే సరైందని ప్రజలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు చెల్లిస్తున్న టాక్స్‌ డబ్బులను గోల్‌మాల్‌ చేసిన కార్పొరేటర్లకు శిక్షలు పడాలని స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బినామీ కాంట్రాక్టర్లతో అవినీతి దందా చేస్తున్న కార్పొరేటర్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్లపై విచారణ చేస్తే అసలు నిజాలు బయటపడతాయి. అధికారులపై చర్యలు తీసుకున్నారు కానీ కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లపై ఎందుకు తీసుకోలేదని ఏసీబీని, విజిలెన్స్‌ అధికారులను ప్రశ్నిస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ నుంచే 7,300 ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాల పుట్టగా పేరొందిన టౌన్‌ ప్లానింగ్‌ను ఎందుకు వదిలేశారో విచారిస్తున్న చెప్పాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

పరస్పరం నిందలు

అధికారుల సస్పెన్షన్‌ తర్వాత అవినీతి కార్పొరేటర్లకు చుట్టుకోవడంతో వాళ్లు పార్టీలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. నాయకులను తెరమీదకు తెచ్చి ఈ అక్రమంలో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లీన్‌ చీట్‌ ఇప్పించుకుంటున్నారు. కొంతమంది కార్పొరేటర్లు ఇంకా మౌనం వీడటం లేదు. ఈ అవినీతి వెనకాల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ హస్తం ఉందని బీజేపీ ఆరోపించగా.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసే అక్రమాలకు పాల్పడ్డరని కాంగ్రెస్‌ పే ర్కొంటుంది. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసే ఖజానా లూటీ వేశాయని కారు పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పబ్బ ం గడుపుతూ ప్రజాసమస్యలను మాత్రం గాలికొదిలేశారు. డివిజన్‌లలో పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి పనులపై పూర్తి విచారణ జరపాలి. అప్పుడే అవినీతి కుంభకోణంలో సూత్రధారులు ఎవరు, పాత్రదారులు ఎవరో తేలిపోతుంది. రూ.122 కోట్లకుపైగా ప్రజల సొమ్మును మింగేసి జవాబుదారితనం లేకుండా బహిరంగంగా తిరుగుతున్న కార్పొరేటర్లపై వేటు పడటమే అసలైన ప్రజాస్వామ్యమని స్థానికులు పేర్కొంటున్నారు.

బడంగ్‌పేట్‌ కార్పొరేటర్లపై వేటు తథ్యమా?

రాజకీయ ఒత్తిళ్లతో జాప్యమని గుసగుసలు

చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement