● నాణ్యమైన భోజనం వడ్డించాలి
● కలెక్టర్ దీపక్ తివారి
కొడంగల్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. గురువారం పట్టణంలోని బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్‌లో వసతులు, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థినుల గదులు, వంటశాల, భోజన శాల, మరుగుదొడ్లు, నీటి సరఫరాపై అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హాస్టల్‌లో నీటి కొరత ఉందని బోరు ఏర్పాటు చేయాలని.. గేటు ముందు భాగంలో గ్రిల్ ఏర్పాటు చేయాలని వార్డెన్లు కలెక్టర్‌ను కోరారు. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాబు, వార్డెన్లు నిర్మల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం హరే కృష్ణ ఫౌండేషన్ ఆధునిక వంటశాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్న అల్పాహారం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని నాలుగు మండలాలకే కాకుండా అన్ని స్కూళ్లకు పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని ఫౌండేషన్ నిర్వాహకులకు సూచించారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అల్పాహారం పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి చైతన్య తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరో ఆరు మండలాలకు పంపిణీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.


