చేవెళ్ల: మండలంలోని ఆలూరు గ్రామంలో వక్ఫ్ బోర్డు భూముల సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గురువారం చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సర్వే బృందం, పోలీసుల బందోబస్త్ మధ్య సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆలూరులోని వక్ఫ్‌బోర్డుకు సంబంధించి 1,248 ఎకరాల భూమికి ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. మొదటిరోజున 90 ఎకరాలు సర్వే పూర్తి చేశామన్నారు. నేటి నుంచి మూడు టీమ్‌లుగా ఏర్పడి మొత్తం వక్ఫ్‌బోర్డు భూమి సర్వే కొనసాగుతుందన్నారు. దీంతో ఈ భూములు ఎవరి ఆధీనంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలుస్తాయని చెప్పారు. సాగు చేసుకునే రైతులకు న్యాయం జరిగేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు.


