సాక్షి, రంగారెడ్డి జిల్లా: పేదల ఆకలి తీర్చేందుకు చౌకధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. ఏకంగా రాష్ట్ర సరిహద్దులు దాటిపోతోంది. లబ్ధిదారులు, రేషన్ డీలర్ల నుంచి కిలోకకు రూ.10 నుంచి రూ.12 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లోని గోదాముల్లో నిల్వ చేసి, రాత్రి వేళల్లో కంటైనర్లు, లారీల్లో రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. అక్కడ కేజీ రూ.30 పైగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. చెక్‌పోస్టుల్లోని పోలీసులు, సివిల్ సప్లయ్, విజిలెన్స్ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ.. బియ్యం అక్రమ నిల్వ, రవాణాను అడ్డుకుంటున్నా.. వీరు వెనక్కి తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వెయ్యి క్వింటాళ్ల బియ్యం పట్టుబడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకేసారి మూడు నెలల కోటా
సంక్షేమ పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం లబ్ధిదారులకు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం సరఫరా చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. ధాన్యం సేకరణ, మిల్లింగ్, చౌకధరల దుఖానాలకు సరఫరా వరకు ఒక్కో కేజీకి కనీసం రూ.70 ఖర్చవుతోంది. జిల్లాలో 936 రేషన్ దుకాణాల పరిధిలో 6.70 లక్షల కార్డులు ఉన్నాయి. 22 లక్షల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతి నెలా 15 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. వేసవి ఎండల నేపథ్యంలో లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు జిల్లాకు 45 వేల మెట్రిక్ టన్నుల రేషన్ సరఫరా చేసింది.
జిల్లాలో కర్ణాటక ముఠా పాగా
ప్రభుత్వం కేజీకి రూ.70 వరకు ఖర్చు చేసి, పేదలకు ఉచితంగా సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని తినేందుకు చాలా మంది లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. కొంత మంది ఇళ్లకు తీసుకెళ్లి అమ్ముతుండగా, మరికొంత మంది ఏకంగా డీలర్లకే కట్టబెడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కర్ణాటకకు చెందిన ఓ ముఠా రంగంలోకి దిగింది. పాతబస్తీ కేంద్రంగా పలువురు ఆటో డ్రైవర్లకు డబ్బులు ఆశచూపి.. ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని సేకరిస్తోంది. రేషన్ డీలర్లు కూడా లబ్ధిదారుల నుంచి రూ.10 చొప్పున కొనుగోలు చేసి, రూ.20 చొప్పున వీరికి విక్రయిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని శివారులో ప్రాంతాల్లోని గోదాములు, మూతబడ్డ పరిశ్రమల్లో డంప్ చేసి, అదను చూసి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. కొంతమంది కొందుర్గు, యాలాల మీదుగా కర్ణాటక వైపు తరలిస్తుండగా, మరికొంత మంది భువనగిరి మీదుగా నిజామాబాద్, కామారెడ్డికి తరలిస్తున్నారు.
కాటేదాన్ కేంద్రంగా కల్తీ
గతేడాది నవంబర్‌లో కాటేదాన్ కేంద్రంగా పని చేస్తున్న గోదాంపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. పంజాబ్, హర్యానా నుంచి దిగుమతి అవుతున్న బాస్మతి బియ్యంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన దొడ్డు రకం రేషన్ బియ్యాన్ని కలుపుతున్నట్లు తేలింది. కర్నూలు నుంచి దిగుమతి చేసుకున్న సోనామసూరిలో అంతే సన్నగా కన్పించే చిట్ల రకం బియ్యాన్ని మిక్స్ చేస్తున్నారు. ఒకే తరహా బియ్యాన్ని వివిధ బ్రాండ్ల పేరుతో ముద్రించిన సంచుల్లో నింపి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇతరులెవరూ లోనికి రాకుండా నియంత్రించేందుకు చుట్టూ 20 సీసీ కెమెరాలు, అధికారులెవరైనా రైడింగ్‌కు వస్తే సులభంగా అక్కడి నుంచి తప్పించుకునేందుకు గోదాం చుట్టూ నాలుగు గేట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి పెద్దమొత్తంలో జీఎస్టీని ఎగవేతకు పాల్పడినట్లు అప్పట్లోనే అధికారులు గుర్తించారు.
పక్కదారి పడుతున్న రేషన్
‘చౌక ధర’కు కొట్టేస్తున్న అక్రమార్కులు
రాత్రికిరాత్రే సరిహద్దులు దాటుతున్న వైనం
మొన్న ‘మెట్’లో నిన్న ‘పట్నం’లో తాజాగా యాలాలలో..
పట్టుబడిన వందలాది క్వింటాళ్ల రైస్
కవాడిపల్లి వద్ద 500 సంచుల్లో డంప్ చేసిన 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధం ఉన్న పాతబస్తీకి చెందిన అఖిల్, మహ్మద్ అమీర్‌పాషా, కంటైనర్ డ్రైవర్ ఆడే రాందాసు, ఆటో డ్రైవర్లు మీర్‌పుర్కాన్, ఆలీఖాన్, జశ్వంత్‌రేను అదుపులోకి తీసుకున్నారు.
ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని మంగల్‌పల్లి వద్ద ఓ రైస్ మిల్లులో 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం పట్టుకుంది.
కొందుర్గుకు చెందిన ఎ.గోపాల్ షాద్‌నగర్‌లో 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించారు. ఓ కంటైనర్‌లో తాండూరు మీదుగా జహీరాబాద్‌కు తరలిస్తుండగా వికారాబాద్ జిల్లా యాలాల మండల పోలీసులు పట్టుకున్నారు.


