బడంగ్‌పేట్: తెలంగాణ ఆడబిడ్డలకు తులం బంగారం సీఎం రేవంత్‌రెడ్డి బాకి పడ్డారని, ఎప్పుడు తీర్చుతాడో చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం బాలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో 103 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం తరఫున ఆడబిడ్డల పెళ్లికి చేయూతనివ్వాలని కేసీఆర్ మదిలో మెదిలిన గొప్ప పథకమని కల్యాణలక్ష్మి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీని ఎప్పుడు నెరవేర్చుతారని ప్రశ్నించారు. నాడు ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని కోసం నల్లాల దగ్గర పోకుండా అడగ్గానే రూ.300 కోట్లు కేసీఆర్ మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆ నిధులతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు, డివిజన్లకు కృష్ణావాటర్ ట్యాంకులు కట్టించి తాగునీటిని సరఫరా చేశామన్నారు. తులం బంగారం ఇచ్చేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇందిరాదేవి, ఆర్‌ఐ స్రవంతి, జూనియర్ అసిస్టెంట్ పుష్పా, జీపీవోలు, సిబ్బంది, లబ్ధిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సబితారెడ్డి


