● అమ్మినా, కొన్నా జరిమానా
● గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గం తీర్మానం
● అంబేడ్కర్ జయంతి రోజు నుంచి అమలు
చేవెళ్ల: తమ గ్రామం నుంచి మద్యం మహమ్మారిని తరిమేసేందుకు కౌకుంట్ల ప్రజలు ఏకమయ్యారు. బెల్టుషాపుల నిర్వహణతో విసిగిపోయిన మహిళలు, ప్రజలు కలిసి కట్టుగా ముందుకు వచ్చి బెల్టుషాపుల నిషేధానికి శ్రీకారం చుట్టారు. మద్యం అమ్మితే లక్ష రూపాయలు, కొన్నవారికి 50 వేల జరిమానా విధిస్తామని, బెల్టుషాపులను పట్టించిన వారికి రూ.10 వేల బహుమతి అందజేస్తామని సర్పంచ్, పాలకవర్గం, మహిళా సంఘాలు, యువజన సంఘాలు గురువారం ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి నుంచి అమలు చేయాలని నిర్ణయించాయి. గ్రామంలోని బెల్టు షాపుల కారణంగా ఎంతో మంది కూలీలు, యువత మద్యానికి బానిసలుగా మారి, కుటుంబాల్లో తగాదాలకు కారణమవుతున్నారని సర్పంచ్ బి.మల్లారెడ్డి, మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయానికి ప్రతిఒక్కరూ మద్దతు తెలిపాలని కోరారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి సునీత ఆధ్వర్యంలో చేసిన తీర్మానం ప్రతిని ఎకై ్సజ్, పోలీసు అధికారులకు పంపిస్తామన్నారు. ఈ విషయం అందరికీ తెలిసేలా టాంటాం వేయిస్తామన్నారు. ఈకార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు జి.అనూష, ఎండీ అసిఫా, విజయ, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు ఎన్.కృష్ణ, యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, గౌండ సంఘం అధ్యక్షుడు సుధాకర్‌గౌడ్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, యువజన సంఘం సభ్యులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


