చున్నీతో గొంతు నులిమి.. ఆపై పెట్రోల్‌ పోసి.. | - | Sakshi
Sakshi News home page

చున్నీతో గొంతు నులిమి.. ఆపై పెట్రోల్‌ పోసి..

Apr 9 2026 9:23 AM | Updated on Apr 9 2026 9:23 AM

పరిగి: బంగారు నగల కోసం ఒంటరి వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. బుధవారం పరిగి సీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్‌ కేసు వివరాలు వెల్లడించారు. బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కొత్తబావి వెంటకమ్మ(63) ఒంటరిగా జీవిస్తోంది. ఆమె మెడలో సుమారు మూడు తులాల బంగారు గొలుసు ఉండటంతో గ్రామానికి చెందిన చీపిరి మంజుల, ఆమె భర్త బీరప్ప కన్ను పడింది. ఎలాగైన ఆమెను అంతం చేసి బంగారం కాజేయాలని పథకం పన్నారు. ఈ నెల 5న వెంకటమ్మ కుల్కచర్లలోని బ్యాంకుకు వెళ్లింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం మంజుల, బీరప్ప దంపతులు వారి బంధువు అరుణ్‌కుమార్‌ వృద్ధురాలిని కలిసి మద్యం తాపించారు. ఆ తర్వాత తిర్మలాపూర్‌ అటవీ ప్రాంతంలోని పాడావులబండ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ గొంతుకు చున్నీ బిగించి హత్య చేశారు. వెంకటమ్మ మెడలోని బంగారు గొలుసు, వెండి నగలు, సెల్‌ఫోన్‌ తీసుకున్నారు. మృతదేహాన్ని రాళ్ల మధ్య వేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పగిడాల గ్రామంలో ఉంటున్న లక్ష్మి తన తల్లి వెంటకమ్మకు ఫోన్‌ చేయగా లైన్‌ కలవలేదు. దీంతో ఆమె బండవెల్కిచర్ల గ్రామానికి వచ్చి తల్లి కోసం వెతికింది. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటకమ్మ సెల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన మంజులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకుంది. ముగ్గురు కలిసి వెంటకమ్మను హత్య చేసినట్లు తేలడంతో బుధవారం కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై రమేష్‌ తెలిపారు.

నగల కోసం వృద్ధురాలి దారుణ హత్య

కుల్కచర్ల మండలంలో ఘటన

కేసు వివరాలు వెల్లడించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌

Advertisement
 
Advertisement
Advertisement