ఆమనగల్లు: తలకొండపల్లి మండలం అంతారం గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోళ్ల పందెం స్థావరంపై పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తలకొండపల్లి ఎస్‌హెచ్‌ఓ జానకిరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అంతారం గ్రామ శివారులో కోళ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ శేఖర్ ఆధ్వర్యంలో సిబ్బందితో దాడి చేశారు. ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరికొంతమంది పరారయ్యారు. నాలుగు పందెం కోళ్లు, ఐదు బైక్‌లు, రెండు మొబైల్ ఫోన్‌లు, రూ.వెయ్యి నగదు, కోళ్ల కాళ్లకు కట్టే 20 కత్తులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కొత్తూరు: ఏడాది కిందట పొలం విక్రయం విషయంలో అమ్మకందారులు, కొనుగోలు దారుల మధ్యన చోటు చేసుకున్న వాగ్వివాదం దాడికి దారితీసింది. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన మల్లెల యాదయ్య, అతడి భార్య అనితల పేరుపై ఇదే గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. ఈ పొలాన్ని గతేడాది హైదరాబాద్‌కు చెందిన కిరణ్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకొని మొదటగా కొంత భాగాన్ని తన భార్య కమిరెడ్డి దీప్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఇరువురికి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కిరణ్ తన భార్య, పిల్లలతో కలిసి కారులో పట్టణంలోని ఓ హోటల్ వద్ద ఉన్నట్లు గుర్తించిన యాదయ్య తన కొడుకుకు సమాచారం ఇచ్చాడు. వెంటనే యాదయ్య కుమారుడు యశ్వంత్ తన స్నేహితులతో కలిసి హోటల్ వద్దకు చేరుకొని కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కిరణ్ భార్యతో పాటు ఇద్దరు కుమారులకు గాయాలైనట్లు బాధితుడు ఫిర్యాదు చేసినట్లు సీఐ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జీఎస్‌టీ సంస్కరణల జాతీయ సెమినార్ మంగళవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా ఐసీఎస్‌ఎస్‌ఆర్ డైరక్టర్ బి.సుధాకర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొత్త ఆలోచనలు, సంస్కరణలకు దోహదం చేస్తాయన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ పీవీ గీతాలక్ష్మి పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ సదస్సుతో జీఎస్‌టీ, ఎంఎస్‌ఎంఈపై లోతైన అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వికసిత్ భారత్ 2047 దిశగా ముఖ్యమైన ముందడుగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా మొత్తం 74 పరిశోధన పత్రాలు ఆమొదం పొందాయి. కార్యక్రమంలో పీఎస్‌పీకే అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ బీపీ భరద్వాజ్, శివకుమార్‌రెడ్డి , తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొ.డాక్టర్.కప్ప కొండల్, సుధీర్, మునిస్వామి, ఆడెప్ప, కరీముల్లా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
బంట్వారం: సీఎం రేవంత్‌రెడ్డి భూ దోపిడీ ఆగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగి పోలీసులు మంగళవారం ఉదయం ఆయన్ను ముందస్తు అరెస్టు చేసి బంట్వారం ఠాణాకు తీసుకొచ్చి సాయంత్రం ఐదు గంటలకు వదలి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేస్తోందని, ఇది సరికాదని హితవు పలికారు. రెండున్నరేళ్ల కాలంలో కాంగ్రెస్ పాలకులు దోచుకోవడం దాచుకోవడం తప్పా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. పోలీసుల అక్రమ అరెస్టులతో తమ ఉద్యమం ఆగదన్నారు. రైతులకు అండగా నిలబడి మరింతగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.


