డీసీఎం టైర్‌ పగిలి.. అదుపు తప్పి | - | Sakshi
Sakshi News home page

డీసీఎం టైర్‌ పగిలి.. అదుపు తప్పి

Apr 8 2026 8:08 AM | Updated on Apr 8 2026 8:08 AM

డీసీఎం టైర్‌ పగిలి.. అదుపు తప్పి

ఎదురుగా వస్తున్న కారును ఢీ

ప్రమాదంలో ఒకరి దుర్మరణం, నలుగురికి తీవ్ర గాయాలు

మహేశ్వరం: డీసీఎం టైర్‌ పగిలి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో కారు డ్రైవర్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీశైలం జాతీయ రహదారిపై నవారు బాల్‌రెడ్డి ఫంక్షన్‌ హాలు సమీపంలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. కందుకూరు గ్రామానికి చెందిన సురసాని భరత్‌సింహారెడ్డి (32), బాబాయి సురసాని రవీందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు స్వాతి, అవినాష్‌రెడ్డి, అమ్ములు కారులో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కందుకూరు వైపు వస్తున్నారు. కందుకూరు నుంచి హైదరాబాద్‌ వైపు డీసీఎం అతివేగంగా వస్తుండగా టైరు పగిలి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భరత్‌సింహారెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, రవీందర్‌రెడ్డి, స్వాతి, అవినాష్‌రెడ్డి, అమ్ములుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌, పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం భరత్‌సింహారెడ్డి సోదరుడు భార్గవ్‌రెడ్డి సైతం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉన్న ఇద్దరు కుమారుల మృతితో తండ్రి శ్రీనివాస్‌ రెడ్డి బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement