ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నిస్తుండగా 100 కాల్ చేయడంతో స్పందించిన పోలీసులు వేగంగా వెళ్లి అతడిని కాపాడిన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తుర్కయంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడ శ్రీసాయి హ్యాపీ హోమ్స్‌లో నివాసం ఉండే రవిరాజ్ తన భార్యతో గొడవ పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఉదయం నుంచి మద్యం తాగాడు. ఏమి చేయలో తోచకపోవడంతో ఆదిబట్ల పరిధిలోని సాహెబ్‌గూడలో రోడ్డు పక్కనే పురుగు మందు తాగి చనిపోతున్నట్లు భార్యకు వీడియో కాల్ చేశాడు. ఆమె వెంటనే 100 ఫోన్ చేయడంతో ఆదిబట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పెట్రోలింగ్ వాహనంలో విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ బాల్‌రాజ్, ఏఆర్‌పీసీ రాజేందర్ స్పందించి ఉన్నతాధికారుల సహకారంతో లోకేషన్ గుర్తించారు. నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిని పెట్రోలింగ్ వాహనంలో తీసుకొని బయలుదేరారు. మార్గమధ్యలో అంబులెన్స్ రావడంతో సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన ఆదిబట్ల పోలీసులు బాల్‌రాజ్, రాజేందర్‌లను సీఐ రవికుమార్ అభినందించారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి అయినప్పటికీ సామాజిక దృక్పథంతో ప్రాణాలు కాపాడిన పోలీసులకు ప్రశంసలు వెల్లువెత్తాయి.
పురుగు మందు తాగిన వ్యక్తిని రక్షించిన ఆదిబట్ల పోలీసులు


