గన్‌ఫౌండ్రీ: వేసవి సెలవులలో పోటీ పరీక్షల పేరుతో కొనసాగుతున్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) డిమాండ్ చేసింది. సోమవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ.. నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.పృథ్వీ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం పూర్తి కాకముందే కొన్ని కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, ఉపాధ్యక్షులు నరసింహారావు, ఎంస్.రాకేష్, ఎం.శివ, సహాయ కార్యదర్శులు వీరభద్రం, కావ్య, అనూష, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


