● నలుగురిని అదుపులోకి తీసుకున్న
పోలీసులు
● 300 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
అబ్దుల్లాపూర్‌మెట్: ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ఓ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వారి నుంచి 300 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అఖిల్ అలియాస్ బబ్లూతో పాటు మహ్మద్ అమీర్ పాషా ఇద్దరు కలిసి ఆదేరామ్‌దాస్, మీర్ పుర్కాన్‌అలీఖాన్, జశ్వంత్‌రాయ్‌ల ద్వారా గ్రామాల్లో ఉండే ప్రజల వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని రూ.10 చొప్పున కొనుగోలు చేసి మండలంలోని కవాడిపల్లి గ్రామ శివారులోని ఓ గోదాంలో నిల్వ చేసి అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గోదాంపై పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేసి అఖిల్ మినహా మిగతా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 300 క్వింటాళ్ల బియ్యంతో కూడిన 510 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఓ కంటైనర్ లారీ, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో ఈ బియ్యాన్ని కిలోకు రూ.18 నుంచి రూ.20 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న నిందితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.


