మొయినాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డూ.. అదుపు లేకుండా పోయింది. నియంత్రణపై పర్యవేక్షణ కరువవడంతో యాజమాన్యాలు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారింది. ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ.. ఫైన్లు వేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలను భరించలేని తల్లిదండ్రులు ఆందోళనలకు దిగుతున్నారు. మొయినాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజులు పెంచుతున్నట్లు ప్రకటించడంతో మూడు రోజుల కిత్రం విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గత ఏడాదే 50 శాతం ఫీజులు పెంచిన యాజమాన్యం ఈసారి మరో 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సుమారు 300 మంది పేరెంట్స్ హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించి ఆందోళన చేశారు.
నిబంధనలు గాలికి..
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు పుస్తకాలు, యూనిఫాంలు పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు. వాటిని సైతం అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫీజుల నియంత్రణతోపాటు పాఠశాలల్లో వసతులు, సౌకర్యాలు, బోధనా విధానం, టీచర్ల క్వాలిఫికేషన్ వంటి విషయాలపై పర్యవేక్షణ కరువైంది. విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు అధికంగా బడాబాబులకు సంబంధించినవే కాావడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫీజు చెల్లింపు ఆలస్యానికి ఫైన్ వేసిన ఓ స్కూల్ యాజమాన్యం
ప్రైవేటు పాఠశాలల ఇష్టారాజ్యం
అడ్డూఅదుపు లేని యాజమాన్యాలు
అడ్వాన్స్‌గా వసూళ్ల పర్వం
ఆలస్యంగా చెల్లిస్తే అ‘ధనం’
కరువైన అధికారుల పర్యవేక్షణ
మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలో ఉన్న ఓ ఇంటర్నేషన్ స్కూల్ యాజమాన్యం అడ్వాన్స్‌గా ఫీజులు వసూలు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజును మూడు టర్మ్‌లుగా విభజించి ఫస్ట్ టర్మ్‌ను మార్చిలోనే వసూలు చేసింది. ఈ ఫీజు చెల్లించడంలో ఆలస్యమైన తల్లిదండ్రులకు ఫైన్ కూడా వేస్తోంది. ఆ పాఠశాలలో పిల్లలను చదివిస్తున్న ఓ తండ్రి ఫీజు చెల్లించడంలో నాలుగు రోజులు జాప్యం కావడంతో రోజుకు రూ.100 చొప్పున రూ.400 అపరాధ రుసుం వేశారు. ఇది సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


