కందుకూరు: ప్రభుత్వానికి భూములిచ్చే రైతులకు పరిహారంతో పాటు అన్ని విధాలా న్యాయం చేస్తామని ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. మండల పరిధిలోని లేమూరు సర్వే నంబర్ 393లోని భూములను సేకరించడానికి సోమవారం సర్పంచ్ ఎలుక మేఘనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం భూమిని సేకరిస్తోందని, అందరూ సహకరించాలని కోరారు. ఎకరాకు రూ.2 కోట్ల పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు సరైన పరిహారం అందించడంతో పాటు గ్రామ అవసరాలకు పది ఎకరాల భూమి కేటాయించాలని సర్పంచ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, ఉప సర్పంచ్ ఇమ్మిడి జంగయ్య, రైతులు పాల్గొన్నారు.
హయత్‌నగర్: హయత్‌నగర్‌లోని ఎంఈఓ కార్యాలయం ఆవరణలో సోమవారం తెలంగాణ మాక్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు సత్తా చాటుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. అంతర్జాతీయ ప్రతినిధుల సమావేశాన్ని తలపించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 13 మంది విద్యార్థులు తమ ప్రతిభతో జిల్లా తరఫున రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. కార్యక్రమంలో జిల్లా ఏఎంఓ జయచంద్రారెడ్డి, రాష్ట్ర స్థాయి ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు: ప్రజలు, రైతులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం నిరంతర పోరాటాలు చేసే సీపీఐకి ప్రజల్లో చక్కటి ఆదరణ ఉందని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు అన్నారు. మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన ఇంటింటికీ సీపీఐ కార్యక్రమానికి హాజరైన ఆయన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. వందేళ్ల కాలంలో సీపీఐ కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల వారి పక్షాన ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. అందుకే ఇంటింటి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్నా ప్రభుత్వాలు, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. రానున్న కాలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు, మారుమూల గ్రామాలు మొదలు పట్టణాల వరకు ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వాలు ఇళ్లు మంజూరు చేసేలా పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి షకీల్, ఎల్లయ్య, అజ్మత్, తాహేర్, నర్సింహ, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: జిల్లాలోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు మొట్టమొదటిసారిగా నిర్వహించిన శిక్షణ తరగతులు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా టీఓటీలు (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) సోమవారం డీపీఓ సురేష్‌మోహన్ సన్మానించారు. ఈ సందర్భంగా టీఓటీ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామ కార్యదర్శుల్లో 25 మందిని టీఓటీలుగా ఎంపిక చేసి వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు. డీపీఓ అందించిన సహకారాన్ని పురస్కరించుకొని సన్మానించినట్లు చెప్పారు. కార్యక్రమంలో శిక్షణాధికారులు శ్రీనివాస్, వెంకటయ్య, సూరిబాబు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


