షాబాద్: రేడియల్ రోడ్డు భూ నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూస్తామని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలో రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న సోలీపేట్, మాచన్‌పల్లి, హైతాబాద్, పెదవేడు, దామర్లపల్లి గ్రామాల్లో సోమవారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే రోడ్డు నిర్మాణం జరగనివ్వమని తేల్చిచెప్పారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న ఏ ఒక్క రైతు కూడా ఆందోళనకు గురి కావద్దని అన్నారు. ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరాకు మూడు రెట్లు ఇస్తామనే విషయం ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు. గ్రామ సభలు మాత్రమే జరుగుతున్నాయని మళ్లీ రైతులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పూర్తిగా భూమి కోల్పోయిన పేద రైతులకు అదనపు పరిహారం ఇచ్చి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి, షాబాద్ తహసీల్దార్ అన్వర్, డిప్యూటీ తహసీల్దార్ మధు, హెచ్‌ఎండీఏ అధికారి అర్చన, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వం
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి


